సినిమా రంగంలో హిట్లు పడాలి అంటే కొండంత టాలెంట్‌తో పాటు గోరంత అదృష్టం కూడా కలిసి రావాలి. కొన్ని సార్లు కొందరు స్టార్ హీరోలు తమ దగ్గరకు వచ్చిన సినిమాలను ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తారు.. అయితే అదే కథతో మరో హీరో సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొడతాడు. ఇక్కడ హిట్ కొట్టిన హీరోది అదృష్టం అయితే.. ఆ కథ వదులుకున్న హీరోది దురదృష్టం అవుతుంది.
తాము వదులుకున్న సినిమా హిట్ అయ్యాక చాలా తప్పు చేశామో అని ఆ స్టోరీ రిజెక్ట్ చేసిన హీరోలు బాధపడుతూ ఉంటారు. ఇవి ఇండస్ట్రీలో చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే నందమూరి నటసింహం ఓ క్లాసిక్ మూవీని వదిలేసుకున్నాడు. అదే మోహన్‌బాబు హీరోగా నటించిన అల్లుడు గారు. అల్లుడు గారు సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చినా ఆ సెంటిమెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు.
మోహన్‌బాబు వరుస ప్లాపులతో కెరీర్ పరంగా డౌన్లో ఉన్నప్పుడు రాఘవేంద్రరావును పిలిచి తనకు ఓ సినిమా చేయాలని కోరాడట. అయితే రాఘవేంద్రరావు అప్పుడే చిరు – శ్రీదేవి జంటగా జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టి కమర్షియల్‌గా తిరుగులేని ప్లేస్‌లో ఉన్నాడు. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మోహన్‌బాబుతో సినిమాకు రెడీ అయ్యాడు. చాలా మంది ఇంత పెద్ద హిట్ తర్వాత.. ప్లాపుల్లో ఉన్న మోహన్‌బాబుతో సినిమా చేస్తే అది ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది… వద్దని చెప్పారట.
అయినా రాఘవేంద్రరావు వినకుండా అల్లుడుగారు సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శోభన ప్రధాన పాత్రలలో నటించారు. మళయాళంలో మోహన్‌లాల్ హీరోగా చేసిన ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ముందుగా హీరోయిన్ సుహాసిని మేనేజర్ దక్కించుకున్నాడు. అప్పటికే బాలయ్య – సుహాసిని కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు రావడంతో… ఆ చనువుతో ఆయన బాలయ్య దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పాడు.
అయితే సెంటిమెంట్ మరీ ఎక్కువుగా ఉండడంతో పాటు తన యాక్షన్ ఇమేజ్‌కు ఇది ఎంత వరకు సెట్ అవుతుందో ? అన్న సందేహంతో బాలయ్య ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. చివరకు ఈ కథ చేతులు మారి అటూ ఇటూ తిరిగి మోహన్‌బాబు దగ్గరకు చేరుకుంది. మోహన్‌బాబు ఈ కథను రాఘవేంద్రరావుకు చెప్పగా ఆయన ఇదే కథతో సినిమా చేస్తానని చెప్పారు. అలా ఆ సినిమా బాలయ్య మిస్ చేసుకోగా.. మోహన్‌బాబు చేసి మంచి హిట్ కొట్టారు.