ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు ? అని చెప్పేందుకు సోషల్ మీడియా అంకెలే ఎక్కువుగా కొలమానాలుగా మారుతున్నాయి. మామూలుగా అయితే గతంలో ఓ హీరో సినిమాల హిట్లు.. 100 రోజుల కేంద్రాలు, కలెక్షన్లు కొలమానంగా ఉండేవి. అయితే ఆ తర్వాత ఏ హీరో సినిమా ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేదే ప్రామాణికంగా మారింది. అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియా మయం అయిపోయింది.
ఏ హీరో సినిమా ట్రైలర్ లేదా పాటలు ఎన్ని రోజుల్లో ఎన్ని లక్షల క్లిక్స్ తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలో ఏ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు. ఏ హీరో సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది.. ఏ హీరో సినిమా ఎన్ని కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.. ఇలాంటి కాలిక్యులేషన్లే హీరో స్టార్‌డమ్‌ను చెపుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఏ హీరో నెంబర్ వన్ అనే దానిపై రకరకాల పోల్స్ కూడా రన్ అవుతున్నాయి.
తాజాగా ఓరామ్యాక్స్ సంస్థ చేసిన సర్వే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సంస్థ ప్రతి నెలా సర్వేలు చేస్తూ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. మే నెలలో చేసిన సర్వేలో ప్రభాస్ ఎప్పటిలాగానే మరోసారి నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. ఆ తర్వాత మహేష్‌బాబు రెండో స్థానంలో ఉన్నాడు. ఇందుకు ప్రధాన కారణం సర్కారు వారి పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యింది. ఇక త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా లెవల్లోకి వెళ్లిపోయిన జూనియర్ ఎన్టీఆర్ మూడో ప్లేసులో ఉన్నాడు.
పుష్పతో పాపులర్ అయిన బన్నీ 4, రామ్‌చరణ్ తేజ్ 5 వ స్థానాల్లో నిలిచారు. ఈ యేడాది భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాన్ 6వ స్థానంలో ఉన్నాడు. ఇక నేచురల్ స్టార్ నాని మొదటి సారిగా టాప్ 10 లిస్టులోకి చేరాడు. నాని 7వ స్థానంలో ఉంటే, రౌడీ హీరో విజయ్ దేవరకొండ 8వ స్థానంలో ఉన్నాడు.
ఇక ఆచార్యతో డిజప్పాయింట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి 9వ ఉంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా మాస్ మహరాజ్ రవితేజ 10వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఈ సర్వేలో రవితేజకు ఎప్పుడూ ర్యాంక్ లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 10వ స్థానంలోకి వచ్చేశాడు.