రాష్ట్రాభివృద్ధిని అడ్జుకుంటున్న వైకాపాకు నంద్యాల ఉప ఎన్నికలో ఓటు ద్వారా బుద్దిచెప్పాలని తెదేపా నేత..నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపాను బలపరచాలన్నారు.రాజధాని లేక లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కఠోర శ్రమతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుకు మద్దతివ్వాలన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారాన్ని.. నంద్యాల పట్టణ శివారులోని వెంకటేశ్వరపురం నుంచి ప్రారంభించారు. నీతి, అవినీతి, ధర్మం, .అధర్మానికి మధ్య జరుగుతున్న పోరు అని అభివర్ణించారు. ప్రజా సేవ చేస్తామని పార్టీలో చేరిన వారు నేడు అదే పార్టీని విమర్శిస్తున్నారు. వారు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకమని అన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు వంటి ఉన్నత పదవులు ఇచ్చి వారిని టీడీపీ గౌరవించింది. అటువంటి వారు వైసీపీ తరపున పోటీచేయడం ఎంత సమంజసమో ప్రజలే నిర్ణయించాలన్నారు.
అధర్మంగా నంద్యాలలో పోటీకి నిలబె్ట్టిన వైకాపాను ఓడించాలన్నారు. జగన్ కు ఎప్పుడూ అధికారయావేనని.. ప్రజలకు సేవ చేయాలంటే ముఖ్యమంత్రి పదవే అవసరం లేదని చెప్పారు. నంద్యాల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. అటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. శిల్పా సోదరులను తెలుగుదేశం పార్టీలోకి పిలిచి పదవులిచ్చి గౌరవిస్తే.. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారని..ఎన్నికల్లో ఓడించి వారికి బుద్ధి చెప్పాలన్నారు. భూమా కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు.