పశ్చిమ గోదావరి మెట్ట ( ఇప్పుడు ఏలూరు జిల్లా) ప్రాంతంలోని తిరుగులేని మాస్ లీడర్‌గా ఎదిగిన వడ్లపూడి ఈశ్వరభాను ప్రసాద్ హఠాన్మరణం పార్టీ వర్గాలను తీవ్రంగా కలిచి వేసింది. పార్టీలో చిన్నప్పటి నుంచే చురుకైన కార్యకర్తగా ఉండే ప్రసాద్ గోపాలపురం నియోజకవర్గ టీడీపీలో క్రియాశీలకంగా ఎదిగారు. గత 20 సంవత్సరాలుగా ద్వారకాతిరుమల మండల రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. అలాంటి వ్యక్తి ఎంతో భవిష్యత్తు ఉండగానే చిన్న వయస్సులో అందరిని విడిచి వెళ్లిపోవడంతో పార్టీకి తీరని లోటని.. పెద్ద ఎదురు దెబ్బే అని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఆర్థిక, అంగ బలాలతో పాటు అందరిని కలుపుకుని పోయే ప్రసాద్ ఇక లేడన్న విషయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రసాద్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లా టీడీపీ కార్యదర్శిగా ఉన్నారు.
2006 జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు :
2006లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ద్వారకాతిరుమల మండలంలో ప్రసాద్ తన దూకుడుతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న కారుమూరి నాడు పశ్చిమగోదావరి జిల్లా జడ్పీచైర్మన్ అభ్యర్థిగా ఉండి ద్వారకాతిరుమల జడ్పీటీసీగా పోటీ చేశారు. నాడు రాష్ట్ర కాంగ్రెస్ యంత్రాగం అంతా ఇక్కడ కేంద్రీకరించినా కారుమూరి స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఆ ఎన్నికల్లో పంగిడిగూడెం రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తోన్న రాజాలు, అధికారం అండతో అందరిని బెదిరించిన అప్పటి ఉంగుటూరు ఎమ్మెల్యే వట్టి వసంత్‌కుమార్ వ్యూహాలకు చెక్ పెట్టి తన తల్లిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. అప్పట్లో అది సంచలనం. నాడు మండలంలో కాంగ్రెస్‌కు 10 టీసీలు వస్తే టీడీపీకి 8 ఎంపీటీసీలు వచ్చాయి. అంత టఫ్ ఎలక్షన్లో కాంగ్రెస్ బయట పడింది.
గోపాలపురం రాజకీయాల్లో కీ రోల్ :
2009 ఎన్నికల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడినా గోపాలపురంలో మాత్రం టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ద్వారకాతిరుమల మండలంలో టీడీపీకి మంచి మెజార్టీ రావడంలో తన వంతు పాత్ర పోషించారు. అనంతరం గట్టి పోటీ మధ్యలో ద్వారకాతిరుమల మండల టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడిగా వచ్చాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యువతరాన్ని ప్రోత్సహిస్తూ 2014 ఎన్నికల నాటికి మండలాన్ని కంచుకోటగా మార్చేశారు. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ద్వారకాతిరుమల మండలంలో మాత్రం టీడీపీ జోరును అడ్డుకునే వారే లేరు.
2014లో భారీ మెజార్టీతో ఎంపీపీగా ఎన్నిక :
2014 ఎన్నికల్లో పండిగూడెం నుంచి నాడు వైసీపీ వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ ఎంపీటీసీగా 560 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆ ఎన్నికల బరిలోకి దిగిన ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు ఎంపీటీసీలు మినహా మండలంలో అన్ని చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ కూడా 5 వేల ఓట్ల పై చిలుకు భారీ మెజార్టీతో టీడీపీ కైవసం చేసుకుంది. చివరకు ద్వారకాతిరుమల మండల పరిషత్ గడ్డపై చాలా ఏళ్ల తర్వాత ప్రసాద్ ఆధ్వర్యంలోనే టీడీపీ జెండా ఎరిగింది. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయంలో కీలక పాత్ర :
2014 ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడంలో ద్వారకాతిరుమల మండలమే కీలకంగా నిలిచింది. ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మండల పార్టీ అధ్యక్షుడి హోదాలో అహర్నిశలు కష్టపడి వ్యూహాలు అమలు చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో టీడీపీకి 8 వేల చిల్లర మెజార్టీ వస్తే.. ద్వారకాతిరుమల మండలం నుంచే సుమారుగా 6 వేల మెజార్టీ వచ్చింది. ఐదేళ్ల పాటు ఎంపీపీగా పనిచేసిన ప్రసాద్ మండలాన్ని తనదైన శైలీలో అభివృద్ధి చేశారు. ఈ ఐదేళ్లలో మండలంలో ఎన్నో అంతర్గత రహదారులు అభివృద్ధి చెందాయి. మారుమూల గ్రామాలకు కూడా తారు రోడ్లు పోయించారు. ద్వారకాతిరుమల ఆలయం మరింత ఉన్నతాభివృద్ధి చెందింది. 2019 ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మొన్న పంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ స్వగ్రామం పంగిడిగూడెంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చి 400 ఓట్ల తేడాతో ఓడింది. అనంతరం ఆయన కృషిని గుర్తించే పార్టీ అధిష్టానం రాజమహేంద్రవరం జిల్లా పార్టీ కార్యదర్శి పదవి కట్టబెట్టింది.
ప్రసాద్ అన్న అంటే మాస్ కా బాస్ :
వడ్లపూడి ప్రసాద్‌కు కార్యకర్తలు, పార్టీ అంటే ప్రాణం. ఎవరు కనిపించినా తమ్ముడూ అని అప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా అక్కడ వాలిపోతాడు. అందుకే ఆయన ప్రజల మనిషి అయ్యారు. అటు జిల్లా స్థాయిలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. నిన్న ఆయన హఠాన్మరణ వార్త తెలిసిన వెంటనే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తీవ్రంగా కలత చెందారు. బావ గారు అంటూ అప్యాయంగా పిలిచే ప్రసాద్ మరణవార్త తట్టుకోలేకపోతున్నానని చెప్పారు.
అటు ముళ్లపూడి బాపిరాజు సైతం తన కుడిభుజాన్ని కోల్పోయానని తీవ్ర ఆవేదన చెందారు. గన్నితో పశ్చిమ మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంటనే వచ్చి ప్రసాద్ పార్తీవదేహంపై టీడీపీ జెండా కప్పి ఘనంగా నివాళులు అర్పించారు.
ఆదివారం అంత్యక్రియలకు గన్ని, బాపిరాజు, ముప్పిడితో పాటు మాజీ విప్ చింతమనేని ప్రభాకర్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ మద్దిపాటి వెంకటరాజు హాజరై ప్రసాద్ పాడె మోసి ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని చివరి వరకు కొనసాగించారు. ఇక ప్రసాద్‌కు ముందు నుంచి కుడిభుజంగా ఉన్న టీడీపీ నేత, ఆయన బావ చింతమనేని హనుమంతరావును ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. ప్రసాద్ రాజకీయ ఎదుగుదలకు హనుమంతరావు ముందునుంచి మెయిన్ పిల్లర్‌గా ఉన్నారు. ఇక గోపాలపురం, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.