టాలీవుడ్‌లోనే కాదు సినిమా రంగంలో ఓ హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరో చేయడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఓ దర్శకుడు ఓ హీరోతో సినిమా అనుకుంటాడు.. ఆ హీరోకు కథ కూడా చెపుతాడు. అయితే ఆ హీరోకు కథ నచ్చకపోవడం వల్లనో లేదా డేట్లు ఎడ్జెట్ చేయలేకో లేదా కథలో మార్పులు చేయాలని దర్శకుడిని కోరితే.. దర్శకుడికి నచ్చకపోవడం వల్లో ఆ కాంబినేషన్ సెట్ కాదే. అయితే అదే కథను.. మరో హీరోతో చేసేస్తారు దర్శకులు. ఆ సినిమా హిట్ అవుతుందా ? ఫట్ అవుతుందా ? అన్నది తర్వాత విషయం. ఆ సినిమా హిట్ అయితే.. అంత మంచి హిట్ సినిమా మిస్ అయ్యానే అని హీరో ఫీలవుతాడు.. అదే ఫట్ అయితే తన జడ్జ్‌మెంట్ కరెక్ట్ అని అనుకుంటాడు.
ఇలా మన తెలుగులో చాలా మంది హీరోలు చేయాల్సిన సినిమాలు ఇతర హీరోలు చేసి హిట్లు కొట్టినవి ఉన్నాయి. వీటిల్లో మనసంతా నువ్వే సినిమా ఒకటి. అప్పటికే ఉదయ్‌కిరణ్ చిత్రం, నువ్వు నేను లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలతో యూత్‌లో తిరుగులేని క్రేజ్‌తో ఉన్నాడు. అప్పుడు ఎంఎస్ రాజు బ్యానర్లో వీఎన్. ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఉదయ్ కెరీర్‌లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా తెరవెనక జరిగిన సంగతి ఓ సారి చూస్తే ఓ కెమేరామెన్ విఎన్. ఆదిత్య దగ్గర ఉన్న కథ గురించి నిర్మాత ఎంఎస్. రాజుకు చెప్పాడట. ఆ తర్వాత రాజు ఆదిత్యకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి కలవమని అడిగినా ఆయన ఏదో ఒక కారణంతో తప్పించుకునేవాడట. చివరకు రాజు ఆఖరు సారిగా మరోసారి ఫోన్ చేసి చూద్దాం అనుకుంటున్న టైంలోనే ఆదిత్య రాజు దగ్గరకు వచ్చారు. తాను లవ్‌స్టోరీతోనే ఇండస్ట్రీకి పరిచయం కావాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
అప్పటికే బాలీవుడ్‌లో వచ్చిన అన్ముల్ గడి సినిమా కథను డెవలప్ చేసుకుని మనసంతా నువ్వే కథ రెడీ చేసుకున్నారు. సినిమా టైటిల్ కూడా మనసంతా నువ్వే అని చెప్పారు. ఈ టైటిల్ ఎంఎస్. రాజు అనుకున్నదే. అప్పటికే రాజుకు మహేష్‌బాబు డేట్లు ఇచ్చారు. దీంతో మహేష్‌ను హీరోగా పెట్టి ఈ సినిమా చేయాలని అనుకున్నారు రాజు. అయితే దర్శకుడు ఆదిత్య కొత్త కుర్రాడితో సినిమా చేద్దామని అనుకుంటున్నాడు. తన కథకు కొత్త కుర్రాడు అయితేనే బాగా సెట్ అవుతాడని చెప్పారు.
ఇప్పుడు కొత్త కుర్రాడు మనకు ఎక్కడ ? దొరుకుతాడని రాజు డైలమాలో ఉండగా.. చిత్రం సినిమా చూసిన ఆదిత్య ఉదయ్‌కిరణ్‌నే తమ సినిమా హీరోగా ఫిక్స్ చేశారు. చిత్రం సినిమాలో ఉదయ్‌కు జోడీ కట్టిన రీమాసేన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆర్పీ. పట్నాయక్ మ్యూజిక్ అదుర్స్. ముఖ్యంగా తూనీగా తూనీగా పాట అయితే ఇప్పటకీ విన్నా కొత్తగానే ఉంటుంది.