ఒకవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నాడనే ప్రకటన పట్ల తమిళనాట భిన్నస్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. రజనీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని స్వాగతిస్తుండగా, తమిళనాడు సీఎం పళనిసామి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తమిళ హీరోలపై సెటైర్లు వేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం కాదు ముందుగా ప్రజాసేవ చేయాలి.. అని పళని వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ లో కూర్చోవాలని కలలు కంటున్న వాళ్లు ముందుగా.. ప్రజల్లోకి వెళ్లాలి.. అని పళని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మరి పళనిసామి వ్యంగ్యం అలా ఉంటే.. రజనీ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందంటూ ప్రకటన చేశారు గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్.
అతి త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. రెండు వారాల్లోగా రజనీ రాజకీయ పార్టీపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తను రజనీతో ఇటీవల సమావేశం అయ్యానని, ఆ సందర్భంగా రజనీ మాటలను బట్టి.. రాజకీయ పార్టీ ఏర్పాటు త్వరలోనే అని తనకు అర్థమైందని మణియన్ వ్యాఖ్యానించారు.మణియన్ వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు రోజుల కిందట భారతీయ జనతా పార్టీ ఎంపీ పూనమ్ మహాజన్ చెన్నై వెళ్లి రజనీకాంత్ తో సమావేశం అయ్యారు. ఆ భేటీ కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.
రజనీని రాజకీయాల్లోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ సమావేశం చర్చనీయాంశంగా నిలుస్తోంది. జెండా, అజెండా జెండా, అజెండాను కూడా ప్రకటిస్తారని గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్ పేర్కొన్నారు. ఇటీవల రజనీకాంత్‌ను రెండుసార్లు కలుసుకున్నట్టు తెలిపారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏదైనా చేయాలనే గట్టి పట్టుదలతో రజనీ ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని, కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పినట్టు వివరించారు.
మరో రెండు వారాల్లో రజనీ పార్టీని ప్రకటిస్తారని తమిళరువి తెలిపారు. కాగా, ఇటీవల ‘కాలా’ చిత్రం షూటింగ్‌లో బిజీ అయిపోయిన రజనీ మళ్లీ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురితో చర్చించినట్టు తెలుస్తోంది. అభిమానులతో రెండో విడత సమావేశం అనంతరం భారీ బహిరంగ సభకు రజనీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సభలో తన పార్టీని ప్రకటించనున్నట్టు సమాచారం.