నందమూరి నటసింహం బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కూడా టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్నసీనియర్లుగా కొనసాగుతున్నారు. వీరు ఎప్పుడూ తమ సినిమాలతో పోటీ పడినా కూడా బాక్సాఫీస్ హీటెక్కిపోతుంది. అన్నయ్య – వంశోద్ధారకుడు, సమరసింహా రెడ్డి – స్నేహం కోసం, నరసింహానాయుడు – మృగరాజు అప్పట్లో ఈ పోటీ అంటేనే మజా ఉండేది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో మరోసారి పోటీపడ్డారు.
ఈ రెండు సినిమాలు కూడా ఈ ఇద్దరు హీరోల కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాలుగా నిలిచిపోయాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పోటాపోటీగా సత్తా చాటాయి. అయితే వీరిద్దరు ఇండస్ట్రీలో నందమూరి, మెగా కాంపౌండ్‌లకు చెందిన ప్రతినిధులుగా ఉండడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా అంతే పోటాపోటీ ఉంటుంది.
ఇదిలా ఉంటే చిరంజీవికి చెందిన ఇంట్లో బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా చిరు ఇంట్లో షూటింగ్ జరుపుకుందన్న విషయం పెద్దగా ఎవ్వరికి తెలియదు. ఆ సినిమాయే నారినారి నడుమ మురారి. 1990లో వచ్చిన ఈ సినిమాలో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. బాలయ్య కెరీర్‌లో ఒక్క ఫైటూ లేకుండా సూపర్ హిట్ అయిన సినిమా ఇదే.
మరో విచిత్రం ఏంటంటే ప్రీ క్లైమాక్స్‌కు ముందు ఏకంగా 20 నిమిషాలకు పైగా హీరో క్యారెక్టర్ కూడా కనిపించదు. ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలో చిరంజీవికి గెస్ట్ హౌస్ లో కొంత షూట్ చేశారు. దాని పేరు హనీ హౌస్.. దానిపక్కనే చిరుకు 2 ఎకరాల స్థలం కూడా చిరంజీవికి ఉంది. ఈ సినిమాలో హీరో బాలయ్య పాత్ర పూరి గుడిసె కూడా చిరంజీవికి చెందిన స్థలంలోనే నిర్మించారు. కొన్ని సీన్లను కూడా చిరుకే చెందిన హనీ గెస్ట్ హౌస్‌లో షూట్ చేశారు.
ఈ సినిమా డైరెక్టర్ కోదండ రామిరెడ్డికి చిరంజీవికి మధ్య ఎంతో అనుబంధం ఉంది. వారిద్దరి కాంబోలో ఏకంగా 23 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ సాన్నిహిత్యంతోనే ఈ గెస్ట్ హౌస్‌లో బాలయ్యతో తాను తీయబోయే సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు కోదండ రామిరెడ్డి షూట్ చేశారట. ఈ నారి నారి నడుమ మురారి సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తిదత్తలు రచయితలుగా వ్యవహరించారు.