Moviesవాళ్ళకి పని పాటా ఏమి లేదు..! వాగుతుంటారు...?

వాళ్ళకి పని పాటా ఏమి లేదు..! వాగుతుంటారు…?

తాజాగా రానా కథానాయకుడిగా ‘నేనే రాజు నేనే మంత్రి’ తీసిన తేజ ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు.ఈ సినిమాని ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా తేజ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆయన సినిమా గురించి తెలియజేసిన విషయాలు… మీ కోసం… “దర్శకుడిగా నేను విఫలమయ్యానో లేదో తెలియదు కానీ… కథల పరంగా మాత్రం నేను తప్పులు చేశాననే చెప్పాలి. అందుకే ఈసారి బలమైన కథని తయారుచేసుకుని సినిమా చేశా’’ అని చెప్పారు డైరెక్టర్ తేజ. ఒకప్పుడు వరుస విజయాలతో తెలుగు చిత్రసీమకి సినిమాలు అందించిన దర్శకుడు తేజ.
గత కొంతకాలంగా తీసిన సినిమాలు వరుస పరాజయాల్ని మూటగట్టుకున్నాయి.

‘‘నాకు తెలిసింది సినిమానే కాబట్టి విజయాలొచ్చినా, పరాజయాలొచ్చినా అదే చేయాలి. అందుకే ‘అహం’ పేరుతో కథ రాసుకొని హీరో రాజశేఖర్ కి చెప్పా… ఆయన క్లైమాక్స్ లో మార్పులు అడిగారు అది నాకు నచ్చలేదు, ఇంకా కొన్ని కారణాలవల్ల ఆయనతో సినిమా చేయడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత నిర్మాత సురేష్‌బాబుకి కథ చెప్పా. ఆయన్ని కలిశాక కథలో మార్పులు చేశాం. ఆయనకీ, రానాకి కథ బాగా నచ్చింది. రాధ పాత్రకి కాజల్‌ అయితే బాగుంటుందని సురేష్‌బాబు సూచించడంతో ఆమెనే ఈ సినిమాకి తీసుకున్నాం. ఆమెకి కూడా కథ చెప్పేసరికి వెంటనే సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారని అడిగింది.
నిజానికి ‘బాహుబలి2’ కంటే ముందే ఈ సినిమా చెయ్యాలి అనుకొన్నాం. మేం మొదలుపెట్టేలోపే ‘బాహుబలి2’ మొదలైంది. దాంతో ఈ సినిమా ఆలస్యమైంది.
, కాజల్‌ చాలా బాగా నటించారు’’.

‘‘(రానా)జోగేంద్ర అనే వ్యక్తి జీవితంలో ఐదేళ్లపాటు జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రతి మనిషిలోనూ మంచి,చెడు ఉంటుంది. మామూలుగా పురుషుడి చరిత్రలోని కథతో సినిమా చేస్తున్నామంటే మంచే చెబుతుంటాం. చెడుని వదిలేస్తుంటాం.కానీ జోగేంద్ర జీవితంలో చెడు కూడా ఉంటుంది. ఐదేళ్లకి ముందు అతను ఎలా ఉండేవాడు? ఐదేళ్ల తర్వాత ఎలా మారాడనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ట్రైలర్‌ని చూసి ఇది రాజకీయంతో ముడిపడిన కథ అనుకొంటున్నారు. కానీ అది నిజం కాదు. ఇది భార్యాభర్తల కథ. ఆ కథకి నేపథ్యంగా రాజకీయ రంగాన్ని ఎంచుకొన్నామంతే. నిజ జీవితంలో మాత్రం అలాంటి కథల్ని, సంఘటనల్ని చూస్తూనే ఉంటాం కానీ తెరకు మాత్రం కొత్త. నేను తీసిన ‘చిత్రం’ సినిమానే తీసుకొంటే అందులో పదహారేళ్ల అమ్మాయి గర్భవతి అవుతుంది. కానీ తెరపై ఎవ్వరూ చూపించలేదు. అది నేను చేయడంతో కొత్త సినిమా అన్నారు. అలాంటి సంఘటనలు నిజ జీవితంలో చాలానే జరుగుతుంటాయి. అలాంటి అనుభూతిని ‘నేనే రాజు నేనే మంత్రి’ పంచుతుంది. వూహాజనితం, హాస్యంతో నిండిన కథలతో పోలిస్తే సమాజం నుంచి పుట్టిన కథలు ప్రేక్షకులకు తొందరగా చేరువవుతాయి’’.

‘‘మనందరికంటే ఎక్కువ రోజులు బతికేది సినిమా. అందుకే తీసే సినిమా బాగుండాలనుకొంటా. డబ్బుతో ముడిపడిన ఓ మంచి కళ సినిమా. జనాల్ని ఉత్తేజితుల్ని చేయొచ్చు, వాళ్లలో ఆలోచనని రేకెత్తించొచ్చు. అందుకే సినిమా బాగా రావాలనే ఓ తపన ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. మంచి నటనని రాబట్టుకొనేందుకు నటుల్ని బతిమాలాలి, అవసరమైతే తిట్టాలి. నేనదే చేస్తుంటా. ఇక్కడ ఏదీ వ్యక్తిగతం కాదు. తేజ ఇప్పుడు మారిపోయాడా అంటే అస్సలు మారలేదనే చెబుతాను. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మారరు, అంతా మారినట్టు నటిస్తారు అంతే. నాకు నటించడం రాదు’’.

‘‘దర్శకుడిగా నాకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయంటే అందుకు కారణం అప్‌డేట్‌ కాలేకపోవడం అని నేననుకోను. ఇక్కడ ఒకసారి తప్పు చేశామంటే, ఆ తప్పులు మళ్లీ మళ్లీ జరిగిపోతుంటాయి ఇది సినిమా. ఈ మధ్యలో తేజ పనైపోయిందని ఎవరైనా మాట్లాడుకొన్నారంటే అర్థం వాళ్లకి పనిలేదనే! వాళ్లకి నిజంగా పనుంటే నా గురించి ఎందుకు మాట్లాడుకొంటారు? సినిమా పరాజయాన్ని చవిచూస్తుందనే వాస్తవం కొన్నిసార్లు తెలిసినా… ఆడుతుందనే ఆశ వాస్తవాన్ని కూడా డామినేట్‌ చేస్తుంటుంది. నిజానికి నాకు ఎదురైన పరాజయాలన్నీ నేను వూహించినవే’’.

‘‘మొన్నటిదాకా నేను కనిపించగానే తలుపులు వేసుకొని లోపల కూర్చునేవారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్‌ని చూశాక జేబుల్లో చేతులు తీసి కంగ్రాట్స్‌ అంటూ మెచ్చుకొంటున్నారు. కొద్దిమంది సూట్‌కేసులు పట్టుకొని సినిమా తీసిపెట్టండని వచ్చారు. అసలు నేను చూడని విజయాలున్నాయా? రాజకీయ నాయకులనైనా నమ్మొచ్చు, వాళ్లు ఐదేళ్లకోసారే పార్టీ మారుస్తుంటారు. సినిమావాళ్లు మాత్రం ప్రతి శుక్రవారం పార్టీ మార్చేస్తుంటారు (నవ్వుతూ). సినిమా హిట్టయిందంటే ‘కంగ్రాట్స్‌…’ అంటూ వెంటబడే వీళ్ళే …అదే సినిమా పరాజయాన్ని చవిచూసిందంటే మాత్రం మార్నింగ్‌ షో అవ్వగానే మనల్ని చూసే చూపే మారిపోతుంది. కథలు పుట్టించడం సమస్య కాదు కానీ..వాటిని సరి అయిన విధంగా ప్రేక్షకులకు నచ్చేలా తాయారు చెయ్యడం కష్టం. ఇకపై విభిన్నమైన సినిమాలే చేస్తా’’.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news