టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ నాటి తరం స్టార్ హీరోలను తోసిరాజని అప్పట్లో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు లాంటి హీరోలు దూసుకుపోతోన్న వేళ ఇండస్ట్రీలోకి వచ్చి కామెడీ కింగ్ అయ్యాడు. కామెడీ సినిమాలు తీయాలంటే రాజేంద్రప్రసాద్ మాత్రమే చేస్తాడు… ఆయనే కామెడీ పండించగలడు అన్నంత పేరు ఒక్క ఆయనకు మాత్రమే దక్కింది.
రాజేంద్రప్రసాద్ స్వస్థలం ఏదో కాదు ఇప్పటి కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు. దివంగత ఎన్టీఆర్ స్వగ్రామమే రాజేంద్ర ప్రసాద్ స్వగ్రామం కూడా..పైగా ఎన్టీఆర్ – రాజేంద్ర ప్రసాద్ ఇద్దరి ఇళ్లు కూడా పక్క పక్కనే ఉండేవి. రాజేంద్ర ప్రసాద్‌కు ఊహ వచ్చేటప్పటికే ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా ఉన్నారు. ఓ సారి ఆయన కూడా సినిమాల్లోకి రావాలని చెన్నై నుంచి విజయవాడ వచ్చిన ఎన్టీఆర్‌ను కలిశారు.
అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లో రాణించాలంటే చాలా కష్టం అని చెప్పారు. నీకంటూ సపరేట్ నటన ఉన్నప్పుడే ఇండస్ట్రీలో రాణించగలుగుతావని కూడా కొన్ని సూచనలు చేశారు. అయినా రాజేంద్రుడి చెన్నై వెళ్లి సినిమా రంగంలో పలు విభాగాల్లో పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, మిమిక్రీ ఆర్టిస్టుగా ఇలా కొన్ని విభాగాల్లో పనిచేశాక.. క్రమ క్రమంగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ హీరో అయ్యాడు.
ఆ తర్వాత కామెడీ హీరోగా ఏ హీరోకు లేని సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నిమ్మకూరులో ఎన్టీఆర్ ఫ్యామిలీ – రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఈ రెండు ఇళ్ల మధ్య బీరకాయలో పీచు బంధుత్వం కూడా ఉంది. ఇక సీనియర్ నటి రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ స్వయానా అల్లుడే అవుతాడు. తనకంటే వయస్సులో చిన్నవాడు అయిన శరత్‌బాబును పెళ్లి చేసుకున్న రమాప్రభకు పిల్లలు లేరు.
దీంతో రమాప్రభ తన సోదరి కుమార్తె చాముండేశ్వరినే పెంచుకున్నారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌తో చాముండేశ్వరి పెళ్లి చేశారు. అలా రమాప్రభకు రాజేంద్రప్రసాద్ అల్లుడు అయ్యారు. ఇప్పటకీ రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీయే అండగా ఉంటూ వస్తుంది. ఇక రమాప్రభ సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో మదనపల్లిలో ఉంటోంది.