ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల గురించిన చర్చలు మాత్రమే వినపడేవి. అదంతా ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్‌స్టార్ కృష్ణ కాలం. అసలు దర్శకుల గురించి ప్రస్తావనే ఉండేదే కాదు. అలాంటి టైంలో నిండా 30 ఏళ్లు లేని కుర్రాడు తీసిన తాత మనవడు సినిమా గురించి ఇండస్ట్రీ అంతా గొప్పగా చెప్పుకుంది. పేరు దాసరి నారాయణరావు. ఎక్కడో గోదావరి జిల్లాల్లోని పాలకొల్లు నుంచి వచ్చాడట. ఏం తీశాడ్రా సినిమా అని గొప్పగా చెప్పుకునేంతగా దాసరి పేరు మార్మోగింది.
అలాంటి దాసరి ఓ గొప్ప నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన 151 సినిమాలు తీసి వేలాది మందికి ఉపాధి కల్పించడం మరో ఎత్తు. అసలు ఆయన ఎన్ని వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి కల్పించారే చెప్పలేం.
అలాంటి దాసరి రాజకీయంగా ఎన్టీఆర్‌తో విబేధించేవారు. ఇదంతా రాజకీయాల వరకే… కానీ అదే ఎన్టీఆర్ – దాసరి కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.
అప్పట్లో రామోజీరావు ఈనాడు దినపత్రిక తెలుగు మీడియా సామ్రాజ్యాన్ని శాసించేది. 1 – 10 వరకు ప్లేసులు ఈనాడువే. ఎవరైనా పోటీపడితే 11 వ ప్లేస్ కోసమే పోటీ పడాలి అన్నట్టగా ఈనాడు శాసించేది. ఈ టైంలో 1984లో దాసరి ఉదయం దినపత్రిక ప్రారంభిస్తారని తెలిసినప్పుడు అందరిలోనూ ఒక్కటే సంచలనం. దాసరి ఉదయం పేపర్ పెట్టడానికి కారణం రామోజీరావే అంటారు.
దాసరి తన సినిమాల్లో విలన్‌కు భానోజీ అని పేరు పెట్టి ఎగతాళి చేయిస్తే.. రామోజీరావు తన చతుర నవల పుస్తకంలో బదనిక అనే నవల రాయించారు. అందులో ఉన్న కార్టూన్ బొమ్మలు అన్నీ దాసరినే పోలి ఉంటాయి. ఈ నవల మెయిన్ లైన్ ఇతరుల రచనలను తన పేరుతో సినిమాలు తీసిన ఓ డైరెక్టర్ కథ. ఇది దాసరిని టార్గెట్‌గా చేసుకుని రాసిన నవలే అంటారు.
ఇక రామోజీ దాసరిని అంతగా టార్గెట్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎన్టీఆర్‌ను రాజకీయంగా వ్యతిరేకిస్తోన్న దాసరి ఏఎన్నార్‌తో కలిసి పార్టీ పెడతారన్న ప్రచారమూ జరిగింది. ఇవన్నీ వీరి మధ్య గ్యాప్‌నకు కారణాలు అయ్యాయి. ఏదేమైనా ఉదయం కొద్ది రోజులకే మూతపడినా ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి ఇచ్చింది.