ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. ఇరవై ఏళ్ల క్రితం మన తెలుగు సినిమాలు కేవలం మన భాషకే పరిమితం అయ్యి ఉండేవి. సౌత్ సినిమాల్లో తమిళ దర్శకుడు శంకర్ చేసిన సినిమాలు మాత్రమే బాలీవుడ్ జనాలకు ఓ మోస్తరుగా నచ్చేవి. అయితే ఆ టైంలోనే నాగార్జున బాలీవుడ్‌లో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. నాగార్జున స్టైల్ బాలీవుడ్ జనాలకు కూడా నచ్చింది. కానీ నాగ్ బాలీవుడ్‌పై ఎక్కువ కాన్‌సంట్రేషన్ చేస్తే తెలుగు ప్రేక్షకులకు ఎక్కడ దూరం అవుతాడో అని ఏఎన్నార్‌తో పాటు అక్కినేని అభిమానులు ఒప్పుకోలేదు. దీంతో నాగ్ ఆ తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకే పరిమితం అయ్యాడు.
ఒక వేళ నాగ్ అప్పటి నుంచే హిందీలో సినిమాలు కంటిన్యూ చేస్తే అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగేవాడు. ఇక నాగార్జునతో అప్పట్లో కొందరు బాలీవుడ్ దర్శకులు కూడా సినిమాలు చేశారు. రాంగోపాల్ వర్మ, మహేష్‌భట్ లాంటి దర్శకులు నాగ్ హీరోగా ద్విభాషా సినిమాలు చేశారు. అయితే ఇవి స్టైల్‌గా మెప్పించినా కమర్షియల్‌గా అనుకున్న రేంజ్‌లో క్లిక్ కాలేదు.
బాలీవుడ్‌లో కొత్త కాన్సెఫ్ట్‌లతో సినిమాలు తీయడంలో దర్శకుడు మహేష్‌భట్‌ది అందెవేసిన చేయి. మహేష్ భట్ తెలుగులో చేసిన ఏకైక సినిమా క్రిమినల్. నాగార్జున హీరోగా రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో నాగ్ డాక్టర్ అజయ్‌గా నటించారు. ఈ సినిమాను నాగార్జున ఎంతో నమ్మిచేశాడు. సినిమా హిట్ అవుతుందని ముందునుంచే మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.
క్రిమినల్ ఫ్యుజిటివ్ ఆంగ్ల సినిమా స్ఫూర్తిగా తీసినట్టు తెలుస్తుంది. ఆ సినిమా నుంచి కొన్ని సీన్లు ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేశారు. రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా హీరోయిన్లు కావడంతో బాలీవుడ్‌లోనూ క్లిక్ అవుతుందని నాగ్ ఆశలతో ఉన్నాడు. మహేష్‌భట్ చెప్పినట్టు చేశాడు. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నాగ్ మరో సినిమా జోలికే పోలేదు.
అంతేకాదు క్రిమినల్ రీ రికార్డింగ్ చెన్నైలో కీరవాణి చేస్తున్నప్పుడు నాగ్ అక్కడకు కూడా వెళ్లి మరీ స్వయంగా పరిశీలించి వచ్చాడు. రీ రికార్డింగ్‌లకు హీరోలు దూరంగా ఉంటారు. నాగ్ ఎంతో మనసు పెట్టి చేసిన సినిమా కావడంతో క్రిమినల్ రీ రికార్డింగ్ పనులను నాగ్ దగ్గరుండి మరీ చూసుకున్నారు. నాగ్ ఇంతలా మనసు పెట్టి చేసి హిట్ అవుతుందని ముందునుంచి నమ్మకంతో ఉన్నా కూడా క్రిమినల్ ప్లాప్ అయ్యింది. సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా కూడా ప్రేక్షకులకు అనుకున్నట్టుగా కనెక్ట్ కాలేదు.