ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో ఎవరికి లేనంత ఊరమాస్ ఫాలోయింగ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కరికే ఉంది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రతో ముందుకు వెళుతోన్న బాలయ్య రేంజ్ ఏంటో గతేడాది రిలీజ్ అఖండ సినిమా మరోసారి ఫ్రూవ్ చేసింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ అఖండ ఏకంగా థియేటర్లలో 50, 100 రోజులు ఆడడంతో పాటు రికార్డు స్తాయి వసూళ్లు కొల్లగొట్టింది.
బాలయ్యకు మాస్ ఇమేజ్ రావడంలో కీ రోల్ పోషించిన సినిమా 1990లో వచ్చిన లారీ డ్రైవర్. బి. గోపాల్ – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఇది. ఆ రోజుల్లో బీ, సీ సెంటర్లను ఈ సినిమా ఊపేసింది. ఈ సినిమా తెరవెనక కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పడు తెలుసుకుందాం. స్టేట్ రౌడి సినిమాతో మాస్ డైరెక్టర్ గా మారారు బి.గోపాల్. సీనియర్ నటుడు, విలన్ పాత్రలతో అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించిన రావుగోపాలరావు గోపాల్‌ను పట్టుకుని తన బ్యానర్లో ఓ సినిమా చేయాలని కోరారు.
గోపాల్ వెంటనే ఓకే చెప్పగా… ఇటు బాలయ్యతో తనకు ఉన్న చనువు నేపథ్యంలో ఆయన్ను కూడా ఒప్పించేశారు గోపాలరావు. వీరిద్దరి కాంబినేషన్‌కు తగ్గట్టుగా కథ సెట్ చేసుకున్నారు. హీరోయిన్‌గా బాలయ్యకు కలిసి రావడంతో పాటు కొంత మాస్ ఇమేజ్ ఉన్న విజయశాంతిని తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ చెప్పిన వంశానికొక్కడు, నిప్పురవ్వ కథలు బాలయ్యకు నచ్చలేదు. చివరకు ఆంజనేయ పుష్పానంద్ చెప్పిన ఈ కథ ఓకే చేశాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య ముందు రిజెక్ట్ చేసిన వంశానికొక్కడు, నిప్పురవ్వ తర్వాత సినిమాలుగా చేయడం విశేషం. లారీడ్రైవర్‌కు మాటలు పరుచూరి బ్రదర్స్ రాశారు.
సినిమా పూర్తయ్యాక రష్ చూసిన పరుచూరి వెంకటేశ్వరరావు రెండు వారాలకు మించి ఆడదని చెప్పారట. అయితే గోపాలకృష్ణ మాత్రం బాలయ్య అంతకు ముందు చేసిన సూపర్ హిట్ ముద్దుల మావయ్య కంటే ఓ రూపాయి ఎక్కువే వసూలు చేస్తుందని చెప్పారట. సినిమా మొత్తం పూర్తయ్యాక చేసిన మార్పులు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించాయని గోపాలకృష్ణ చెప్పారు. సినిమాలో శారద పోషించిన కలెక్టర్ పాత్ర సీన్లు కొన్ని కామెడీగా ఉన్నాయని.. అవి నారీ నారీ నడము మురారి తరహాలో కామెడీగా అనిపించాయని.. రీ షూట్ చేయాలని..సీరియస్ నెస్ వచ్చేలా చూడాలని గోపాల్‌కు చెప్పగా ఆయన మళ్లీ రీ షూట్ చేశారట.
ఇక సెన్సార్ అయ్యాక ఫస్ట్ కాపీ చూస్తే శారదను విలన్ కొట్టాక దసరా వచ్చిందయ్యా పాట రావడంతో కలెక్టర్‌కు అవమానం జరిగాక.. హీరో, హీరోయిన్లు సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటని.. ఆ పాట ప్లేస్‌మెంట్ మార్చాలని మళ్లీ డైరెక్టర్ గోపాల్‌కు చెప్పారట. గోపాల్ మాత్రం ఎన్ని సార్లు చెప్పినా ఒప్పుకోలేదట. అదే సమయంలో బి. గోపాల్ అసిస్టెంట్ డైరెక్టర్ స్వర్ణ సుబ్బారావు ( బాలయ్య విజయేంద్రవర్మ డైరెక్టర్) డైరెక్టర్ గారిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని అనడంతో స్వర్ణ సుబ్బారావును తాను తిట్టానని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.
చివరకు గోపాల్ తాను చెప్పినట్టు సీన్ ఆర్డర్ మార్చాడని.. ఆ మార్పులతో సినిమా మరింత క్రిస్పీగా రావడంతో పాటు సూపర్ హిట్ అయ్యిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. లారీ డ్రైవర్ అప్పట్లోనే వారం రోజుల్లో కోటి రూపాయల వసూల్లు రాబట్టడంతో పాటు 42 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.. అలాగే 8 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.