మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మూడేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చి ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అన్నింటిని దర్శకుడు కొరటాల శివ తల్లకిందులు చేసేశాడు. ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోవడానికి ఎవ్వరిని తప్పుపట్టలేం. ఇందుకు నూటికి నూరు శాతం బాధ్యత దర్శకుడు కొరటాల శివదే.
దర్శకుడు కొరటాల శివకు ఎప్పుడూ కథ, రచనే బలం.. కానీ ఈ సినిమాలో ఆ రెండు పూర్తిగా తేలిపోయాయి. అందుకే సినిమా పూర్తి నిస్సారంగా మారిపోయింది. తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. వీరిని డైరెక్ట్ చేసే మంచి ఛాన్స్ దక్కించుకున్న కొరటాల శివ ఆ ఛాన్స్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. కొరటాల మీద అందరూ పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోలేకపోయాడు.
ఇవన్నీ ఇలా ఉంచితే ఈ సినిమాకు ఎందుకో గాని ముందు నుంచి బజ్ లేదు. ఉదాహరణకు త్రిబుల్ ఆర్ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతోందంటే బెనిఫిట్ షో టిక్కెట్ రు. 1000 ఉన్నా టిక్కెట్లు రెండు రోజుల ముందే అయిపోయాయి. పైగా టిక్కెట్ల కోసం రాజకీయ నాయకుల నుంచి కూడా థియేటర్ల యజమానులకు ఒత్తిళ్లు వెళ్లాయి.
అసలు ఆచార్య విషయానికి వస్తే అసలు ఈ సినిమాకు ముందు నుంచి అభిమానుల సంగతి అలా ఉంచితే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లోనే బజ్ లేదు. అంటే కొరటాల ఏదా తేడా చేస్తున్నాడన్న డౌట్లు ముందు నుంచే ఉన్నాయి. అసలు మెగా కాంపౌండ్‌లో అల్లు అర్జున్, సాయితేజ్ లాంటి వాళ్లు నటించిన సినిమాలకే ఓపెనింగ్స్, ప్రీ బుకింగ్స్ అదిరిపోతూ ఉంటాయి. అయితే ఆచార్యలో చిరంజీవి, అటు చెర్రీ ఇద్దరూ కలిసి నటించారంటే ఓపెనింగ్స్, ప్రీ బుకింగ్స్ ఎలా ఉండాలి.. దద్దరిల్లిపోవాలి.. దుమ్ము రేగాలి.
అసలు ఆచార్యపై ముందస్తుగా మెగాభిమానులకే ఎలాంటి అంచనాలు లేవు. ఈ రోజు ఆంధ్రాలో బీ, సీ సెంటర్లలో చాలా చోట్ల ప్రీమియర్, బెనిఫిట్ షోలకు 100 టిక్కెట్ల తెగని పరిస్థితి ఉంది. అదే భీమ్లానాయక్‌కు ఇక్కడ షోలు లేవుని చాలా మంది హైదరాబాద్ వెళ్లి మరీ చూశారు. ఆంధ్రా వాళ్లు తమకు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లి మరీ అర్ధరాత్రి షోలు చూసి వచ్చారు.
ఎందుకో ఆచార్యకు పవన్ అభిమానుల నుంచి సపోర్ట్ లేకపోవడం కూడా పూర్ జబ్‌కు కారణమైంది. దీనికి తోడు అటు అల్లు కాంపౌండ్, అల్లు ఆర్మీ అని ఈ మధ్య మెగాభిమానులు డివైడ్ అయిన పరిస్థితి ఉంది. అల్లు అభిమానులు కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఎంత వరకు చిరును అభిమానించే వారే వచ్చరు. పైగా ఆ తరం జనరేషన్ అభిమానుల్లో పెద్ద వయస్సు వాళ్లు, 55 + ఏజ్ ఉన్న వాళ్లు ఇప్పుడు కుర్రాళ్లలో రారు. వీరంతా సినిమాపై అనాసక్తితో ఉండడం కూడా సినిమా పూర్ బజ్‌తో స్టార్ట్ అవ్వడానికి కారణమైందని అంటున్నారు.