జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాలతో పాదయాత్రలు వద్దనుకుంటే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వ్యాఖ్యానించారు. గతంలోనే కాదు ఇప్పటికి కూడా పాదయాత్రకు ఆదరణ ఉందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోడానికే రాజకీయాల్లోకి వచ్చేది… పుస్తకాలు చదివి, నలుగురు వ్యక్తులు చెప్పిన మాటలు వింటే సమస్యలు తెలుస్తాయనుకోవడం అవివేకమని భరద్వాజ్ పేర్కొన్నారు.
ప్రజా నాడి తెలుసుకోడానికి ప్రయత్నించాలని ఆయన పవన్‌కు సలహా ఇచ్చారు. ఇటీవల ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన సింపోజియంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ తనకు పాదయాత్రలు చేయడం ఇష్టం లేదని ప్రకటించారు. ప్రత్యేక హోదా అంశంలో పవన్ కల్యాణ్‌పై తమ్మారెడ్డి విమర్శనాస్త్రాలను సంధించారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. దీనిపై ఆయనకే ఓ క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. హోదాను డిమాండ్ చేయకుండా క్లారిటీ అంటే ఏంటని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసిన తర్వాత క్లారిటీ అంటే ఏంటో ఆయనే తేల్చుకోవాలని అన్నారు. మోదీ, చంద్రబాబును తిట్టకుండా రాష్ట్ర మంత్రులను టార్గెట్ చేసుకోవడం ఏంటని ఆయన తప్పుబట్టారు.అంతేకాదు గతంలో ఏపీ హక్కులు, కేంద్రం స్పందనపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించి, తీరును ప్రశ్నించేవారు. రాష్ట్రంలోని అధికార, విపక్షాలను మాత్రం ఆయన పెద్దగా విమర్శించిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పటికీ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ, సమస్యల పరిష్కారానికి జగన్‌ను కలవడానికి అభ్యంతరం లేదని పేర్కోవడం చర్చనీయాంశమైంది.