అఖండ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అఖండ విజయంలో ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ ఎంత ఆయువు పట్టో తెలిసిందే. ముఖ్యంగా అఖండ సినిమా గ్రాఫ్ లెగిసింది ఇంటర్వెల్ బ్యాంగ్‌తోనే..! ఆ సినిమాతోనే అఖండ ఆగమనం ఉంటుంది. అక్కడ వచ్చే ఫైట్ అదిరిపోతుంది. దర్శకుడు బోయపాటి ఓ గుహలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశారు. ఆ ఫైట్ సినిమాకు ఎంత హైలెట్‌గా నిలిచిందో చూశాం. అయితే ఈ సీన్ షూట్ చేయడానికి తాము ఎంత కష్టపడ్డామో… తాను ఎంత టెన్షన్ పడ్డానో సినిమాటోగ్రాఫర్ సీ రాం ప్రసాద్ స్వయంగా చెప్పారు.
బాలయ్య సినిమాలకు సి. రాం ప్రసాద్ ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేస్తారో తెలిసిందే. బాలయ్యకు గతంలో వీఎస్. ఆర్ స్వామి వరుసగా సినిమాటోగ్రాఫర్‌గా ఉండేవారు. ఆ తర్వాత రాం ప్రసాద్ వరుసగా కంటిన్యూ అవుతున్నారు. అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్ అరకులో గుహల్లో షూట్ చేయాలని బోయపాటి రాం ప్రసాద్‌కు సూచించారట. అయితే అరకు అనేది మన తెలుగు రాష్ట్రాలకు మాంచి టూరిస్ట్ స్పాట్ అని.. అక్కడ గుహలు అందరూ ఇప్పటికే చూసేయడంతో … ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కొత్తగా ఉండాలని లోపల గుహలో సెట్ వేశారట.
ఆ విజువ్సల్ హై ఫ్రేమ్ రేట్‌లో ఉండాలని.. వాస్తవంగా ఆ సీన్లు డే టైం షూట్ చేయాలని.. అయితే డార్క్ మోడ్‌లో షూట్ చేయాల్సి రావడంతో గుహలో భారీ ఎత్తున లైట్లు వేసి మరీ షూట్ చేశామని రాం ప్రసాద్ చెప్పారు. గుహ అంతా సెట్ వేయడంతో పాటు లోపల లైట్ల కోసం 20 జనరేటర్లు పెట్టి… రోజుకు 4 వేల లీటర్ల డీజిల్ ఖర్చు చేసి మరీ ఆ ఇంటర్వెల్ తీశామన్నారు.
ఓ వైపు వెనక నుంచి టైం ఎక్కువ అవుతోందన్న కామెంట్లు వస్తున్నాయని.. లైట్స్ హీట్ అవుతున్నాయని కొందరు అనేవారని.. అయితే ఫైట్ మాస్టర్లకు ఆ ఫ్రేమ్ రేటింగ్‌లో చేస్తేనే క్వాలిటీ వస్తుందని.. పక్కన ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం టైం టేకింగ్ తీసుకున్నా… తాను అనుకున్నట్టుగానే షూట్ చేశానని రాం ప్రసాద్ చెప్పారు. అందువల్లే అంత క్వాలిటీతో ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయన్నారు.
సెట్ వేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో ఉంటుందని.. సెట్ అంతా వాటర్ స్ప్రే చేసి.. ఆలీవ్ గ్రీన్ కొట్టి ఆ రిప్లెక్షన్ క్యాప్చర్ చేశామని చెప్పారు. నటీనటుల ఫేస్‌కు జెల్ రాసి ఆ రిప్లెక్షన్‌లోనే తాము షూట్ చేశామని.. ఈ సీన్లు షూట్ చేయడం తనకు కాస్త టఫ్ అనిపించిందని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టే అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్‌కు వీళ్లంతా ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. అటు బాలయ్య కూడా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వీరవిహారం చేసేశాడు.