టాలీవుడ్ టాప్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ కొట్టి రెండున్నరేళ్లు అవుతోంది. ఎప్పుడో 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఏదీ రాలేదు. అల సూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే నాన్ బాహుబలి రికార్డులకు కూడా పాతరేసేసింది. మళ్లీ త్రివిక్రమ్ తన రేంజ్ ఏంటో ఇండస్ట్రీకి చాలా ఘనంగా చాటి చెప్పుకున్నాడు. అప్పటి నుంచి మరో సినిమా చేయలేదు. మధ్యలో ఎన్టీఆర్ సినిమా అన్నారు.. కుదర్లేదు. ఇక ఇప్పుడు మహేష్‌బాబుతో ఫిక్స్ అయ్యాడు.
మహేష్‌బాబు – త్రివిక్రముడి కాంబోలో అప్పుడెప్పుడో 2005లో అతడు.. ఆ తర్వాత 2010లో ఖలేజా వచ్చాయి. నిజానికి ఈ రెండు మంచి సినిమాలే అయినా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అతడుకు బడ్జెట్ ఓవర్ అయ్యింది. త్రివిక్రమ్ ఇంత గ్యాప్ తీసుకున్నా ఆదాయానికి వచ్చిన ఇబ్బంది లేదనే టాక్ ఉంది. భీమ్లానాయక్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ మనోడే. రు. 10 కోట్లు ముట్టిందని అంటారు ఈ సినిమాకు..!
ఇక ఇప్పుడు సాయితేజ్ – పవన్, పవన్ – వైష్ణవ్ తేజ్ సినిమాల కథలు, కసరత్తులు నడుస్తూనే ఉన్నాయ్..!ఇక ఇప్పుడు మహేష్ సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట తర్వాత అంటే ఏ జూన్, జూలై నుంచో మహేష్ – త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.. ఆ తర్వాత త్రివిక్రమ్ పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు. కొన్ని సినిమాలకు.. ఇంకా చెప్పాలంటే పవన్ అన్ని సినిమాలకు బ్యాక్ ఎండ్‌లో పనిచేసినా.. డైరెక్టర్‌గా తన పేరు వేసుకోవాలంటే ఏదో ఒక సినిమా చేయాలి.
అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. మహేష్ తర్వాత సినిమా చేద్దామంటే ఎన్టీఆర్ – ప్రభాస్ – పవన్ – చిరంజీవి ఫుల్ బిజీ. బన్నీ పుష్ప 2 తర్వాత మరో ఒకటి రెండు ప్రాజెక్టుల్లో బిజీ కానున్నాడు. బన్నీ – కొరటాల కాంబో లైన్లో ఉంది. త్రివిక్రమ్ సినిమా చేయాలనుకుంటోన్న వాళ్లలో సీనియర్ హీరో ఒక్క వెంకటేష్ మాత్రమే ఖాళీగా ఉండేలా ఉన్నాడు.
ఇక ఎన్టీఆర్ మామూలుగా అయితే త్రివిక్రమ్‌తో చేస్తాడు.. అయితే తేడా వచ్చిందన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా నడుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటున్నారు.. ఎన్టీఆర్ మరీ అంత పంతాలకు, పట్టింపులకు పోయేవాడు కాదు. అసలు అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా అంటేనే యంగ్ స్టర్స్ అందరూ భయపడ్డారు. అలాంటి టైంలో ఎన్టీఆర్ అరవింద సమేత చేయడం నిజంగా త్రివిక్రమ్ రుణపడి ఉన్నట్టే లెక్క.
ఇప్పడున్న యంగ్‌స్టర్స్‌లో త్రివిక్రమ్ హిట్లలో ఉంటే.. ఫామ్‌లో ఉంటేనే దగ్గరకు రానిస్తారు. కానీ త్రివిక్రమ్ కెరీర్‌లోనే ఘోరమైన ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడం చూస్తే ఎన్టీఆర్ త్రివిక్రమ్‌ను ఎంతలా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. మరి త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను వదులుకున్నాడా ? లేదా ? ఇంకేదైనా జరిగిందా ? అన్నది అర్థం కావడం లేదు. కానీ వీరిద్దరి కాంబోలో అల రేంజ్ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ ఇరువైపులా వెయిట్ చేస్తున్నారు.