ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా అందరి నోటా వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళియే. చాలా మంది రకరకాల లెక్కలు వేసి రాజుహిరాణి అనో, వివేక్ అగ్నిహోత్రి అనో, ప్రశాంత్ నీల్ అనో చెపుతారు. కానీ ఇన్నేళ్ల సక్సెస్ ట్రాక్ రికార్డు… ఓ ప్రాంతీయ భాషా సినిమాను ప్రపంచ వైపు నడిపించిన తీరు… బాహుబలి రెండు పార్టులు, ఇప్పుడు త్రిబుల్ ఆర్ సక్సెస్ ఇవన్నీ చూశాక ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న కమర్షియల్ లెక్కలు పోల్చి చూస్తే రాజమౌళియే నెంబర్ వన్. అందులో ఎలాంటి డౌట్ లేదు.
తన 22 ఏళ్ల కెరీర్‌లో 12 హిట్ సినిమాలు.. ఒక్కో సినిమా దేనికదే ప్రత్యేకం. అసలు సింహాద్రి సినిమాతోనే రాజమౌళి స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది. ఇక మగధీర సినిమా చూశాక రాజమౌళి విజన్, విజువల్స్ ఏంటన్నది సౌత్ సినిమాకు తెలిసిపోయింది. తనకు హీరో అక్కర్లేదు.. ఈగ సినిమాతో అయినా సంచలనం క్రియేట్ చేస్తానని సవాల్ చేసి మరీ ఈగతో హిట్ కొట్టి చూపించాడు. ఇక సునీల్ లాంటి కమెడియన్‌తో మర్యాద రామన్న సినిమా తీసి హిట్ కొట్టాడు.
ఇక బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను ఆకాశానికి తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ప్రపంచం మొత్తం బాలీవుడ్‌ను దాటుకుని కిందకు వచ్చి తెలుగు సినిమా వైపు చూస్తోన్న పరిస్థితి. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. అది ఎన్టీఆర్‌కు కెరీర్ పరంగా రెండో సినిమా. ఆ సినిమాకు దర్శకుడు రాజమౌళి అయినా తన గురువు రాఘవేంద్రరావుపై ఉన్న అభిమానంతో దర్శకత్వ పర్యవేక్షణగా ఆయన పేరు వేశారు.
అయితే రాజమౌళి డైరెక్టర్ అవ్వడానికి ముందు ఈటీవీలో వచ్చిన శాంతినివాసం సీరియల్‌ను డైరెక్ట్ చేశాడు. అప్పటికే రాజమౌళికి సినిమా రంగంలో రకరకాల విభాగాల్లో పని చేయడంతో చాలా అనుభవం వచ్చేసింది. రాఘవేంద్రరావు దగ్గర రాజమౌళి చాలా సినిమాలకు పనిచేశారు. కథల్లోనూ, మేకింగ్‌లోనూ రాజమౌళి విజన్ రాఘవేంద్రుడిని బాగా ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే తాను నిర్మించిన శాంతినివాసం సీరియల్‌ను డైరెక్ట్ చేసే బాధ్యత రాజమౌళికే అప్పగించారు రాఘవేంద్రరావు. ఈ శాంతినివాసం సీరియల్ అప్పట్లో పెద్ద సంచలనం. బుల్లితెరపై చాలా తక్కువ సీరియల్స్ మాత్రమే అప్పట్లో వచ్చేవి. ఇందులో శాంతినివాసం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తూ రాజ్యమేలేసింది. ఈ సీరియల్‌ను బాగా డైరెక్ట్ చేశాడన్న ప్రశంసలు రావడంతో ఆ తర్వాత రాఘవేంద్రుడి పర్యవేక్షణలోనే డైరెక్టర్ అయ్యాడు రాజమౌళి.