పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1996లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన గోకులంలో సీత సినిమా నుంచి పవన్ విజయాల పరంపర ప్రారంభమైంది. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుసగా ఆరు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ శిఖరాగ్రాన నిలిచాడు.
పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ లో తిరుగులేని హీరోని చేసిన సినిమా తొలిప్రేమ. అయితే యూత్ లో పవన్ ను దేవుడిగా నిలబెట్టిన సినిమా మాత్రం బద్రి అని చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమాలో అమీషా పటేల్, రేణుదేశాయ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నటించిన రేణుదేశాయ్ తర్వాత పవన్ కళ్యాణ్ నిజ జీవిత భాగస్వామి అయ్యారు. ఇక బద్రి సినిమాతోనే పూరి జగన్నాథ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆ రోజుల్లోనే బద్రి సినిమా 45 కేంద్రాలలో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన పూరి జగన్నాథ్ కథ రాసుకుని డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు సినిమా హిట్ అవ్వడంతో నిర్మాత టి. త్రివిక్రమరావు పవన్ కళ్యాణ్ కు కోటి రూపాయల చెక్కు ఇచ్చి తన బ్యానర్లో సినిమా చేయమని అడిగారు. పవన్ కళ్యాణ్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి సినిమా బద్రి కావడం విశేషం.
పూరి జగన్నాథ్ త్రివిక్రమరావును కలవడంతో పాటు తన కథ వినిపించారు. చివరకు ఈ కథ పవన్‌కు వినిపించాలని డిసైడ్ అయ్యారు. పూరి రాసుకున్న కథను పవన్ కళ్యాణ్ కు చెప్పేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. పవన్ కు కథ చెప్పేందుకు వెళ్ళిన పూరి ఒక అమ్మాయి.. అబ్బాయి ప్రేమలో ఉంటారు. అయితే ఆ అమ్మాయి హీరోతో మరో అమ్మాయిని ప్రేమించాలని పందెం వేస్తుంది. అయితే వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటారు అని పూరి లైన్ చెప్పాడట.
ఈ లైన్ విన్న రెండు నిమిషాలకి క్లైమక్స్ ఏంటని అడిగిన పవన్ వెంటనే ఓకే చేశాడట. అప్పట్లో రెండు నిమిషాల్లో పవన్ ఓకే చేసిన సినిమాగా బద్రి సినిమా వార్తల్లో నిలిచింది. చివరకు పవన్ గురి తప్పలేదు.. బద్రి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా ఈ రోజుకు కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత మరోసారి పవన్ – పూరి కాంబోలో కెమేరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా వచ్చింది.