దేశ వ్యాప్తంగా ఏకంగా 100కుపైగా బ్రిడ్జీలు ఏ క్షణమైనా కూలిపోయే దుస్థితిలో వున్నాయని, సదరు బ్రిడ్జీలపై అత్యవసరంగా దృష్టిసారించాల్సిన అవసరం వుందని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ 1.6 లక్షల బ్రిడ్జీలపై జరిపిన పరిశీలనలో ఈ భయంకరమైన వాస్తవం వెలుగుచూసింది. దాదాపు 100కుపైగా బ్రిడ్జీలు ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం వుంది అని మంత్రి గడ్కరీ స్పష్టంచేశారు. ప్రమాదాలని అరికట్టడం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా దేశంలోని అన్ని బ్రిడ్జీలు, కల్వర్టులకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గతేడాదే ఓ స్పెషల్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
సరిగ్గా ఏడాది క్రితం 2016, ఆగస్టు 2న మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లాలో సావిత్రి నదిపై బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన వంతెన కూలిపోయిన కారణంగా జరిగిన ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భూసేకరణ, ఆక్రమణలు, పర్యావరణ అనుమతులు వంటి వివిధ సమస్యలతో ఆగిపోయిన రూ.3.85 కోట్ల విలువైన రోడ్ ప్రాజెక్టు పనులని తమ ప్రభుత్వం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుందని మంత్రి సభ్యులకి తెలిపారు. అంతేకాకుండా జాతీయ రహదారులపై ప్రతీ 50 కి.మీలకి ఒక చోట ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్, ఫుడ్ కోర్ట్స్, విశ్రాంతి గదులు, ఎక్కడికక్కడ స్థానిక ఉత్పత్తులు అమ్ముకునేందుకు వీలుగా వసతులు కల్పించే విధంగా కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది అని మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.