Moviesవైజ‌యంతీ మూవీస్‌.. ఉపేంద్ర డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా...!

వైజ‌యంతీ మూవీస్‌.. ఉపేంద్ర డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా…!

ఇప్పుడంటే టాలీవుడ్‌లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సినిమాలు తగ్గిపోయాయి. ఉపేంద్ర అప్పుడప్పుడు మాత్రమే తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉపేంద్ర సినిమాలు అంటే తెలుగులో పిచ్చ క్రేజ్ ఉండేది. ఉపేంద్ర స్టైల్ అంటే అప్పటి యువతరం చ‌చ్చిచిపోయేది. 1998లో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా ఏ తెలుగులో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు రిపీటెడ్ గా చూసి ఇక్కడ బ్లాక్ బస్టర్ చేశారు. తర్వాత ఉపేంద్ర తన పేరునే టైటిల్‌గా పెట్టుకొని ఉపేంద్ర సినిమా చేశాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది.

చిత్రవిచిత్రమైన బాడీ లాంగ్వేజ్‌తో ముక్కుసూటిగా మాట్లాడే పాత్రల స్వభావాలతో తనకంటూ ఉపేంద్ర అప్పట్లో తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఉపేంద్ర కు దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన సినిమా 1995 లో వచ్చిన ఓం. శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యధిక రీ రిలీజ్‌లు దక్కించుకుని రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం నమోదు చేసింది అంటే 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను రు. 10 కోట్లకు అమ్మారు. తెలుగులో రాజశేఖర్ హీరోగా… ప్రేమ హీరోయిన్ గా ఉపేంద్ర డైరెక్షన్ లోనే ఈ ఓం రీమేక్ చేశారు. ఎల్బీ శ్రీరామ్ మాటలు సమకూర్చిన ఈ సినిమాను ప్రతి సీన్ కూడా కన్నడ ఓంకు మ‌క్కికి మ‌క్కీ దించేశారు.

అయితే తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. మన ప్రేక్షకులు అంత వైలెంట్ స్టొరీని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఈ సినిమా త‌ర్వాత ఉపేంద్ర పేరు సౌతిండియాలో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ తర్వాత తెలుగులోనూ అతడికి దర్శకుడిగా స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఉపేంద్ర డైరెక్షన్లో ఓ సినిమా చేయాలని ఆశ పడ్డారు. అగ్ర నిర్మాత.. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ తన బ్యానర్ లో చిరంజీవి హీరోగా ఉపేంద్ర డైరెక్షన్‌లో ఓ సినిమాను ఓకే చేశారు. చిరంజీవి కూడా ఓకే చెప్పారు… అయితే ఉపేందర్‌కు అప్పటికే ఉన్న కమిట్ మెంట్ లతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.

ఒకవేళ ఉపేంద్ర చిరంజీవిని డైరెక్ట్ చేసి ఉంటే మరింత స్టార్ డైరెక్టర్ అయ్యేవాడు. అలాంటి మంచి అవకాశం తాను వదులుకున్నానని ఉపేంద్ర ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు. తాజాగా జరిగిన గ‌ని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుని బాధపడ్డారు. తనకు తెలుగులో కన్యాదానం, ఒకేమాట లాంటి స్ట్రైట్‌ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీతో తనకు ఎంతో అనుబంధం ఉంది అని… ఒకేమాట సినిమాలో నాగబాబుతో కలిసి తాను స్క్రీన్ షేర్ చేసుకున్నానని… ఆ తర్వాత అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో…. ఇప్పుడు గని సినిమాలో వరుణ్ తేజ్‌తో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని ఉపేంద్ర చెప్పారు.

ఇక సొంత భాషలో ఉపేంద్ర నటించిన కబ్జా సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. ఏదేమైనా రెండు దశాబ్దాల క్రితం సౌతిండియాలో హీరోగా… దర్శకుడిగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఉపేంద్ర డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా అది మెగాస్టార్ కెరీర్లో వైవిధ్యమైన సినిమాగా మిగిలిపోయింది ఉండేది. ఆ టైంలో చిరంజీవి కెరీర్ కాస్త డౌన్‌లో ఉంది. చిరు సైతం ఏ సినిమా చేయాలో తెలియ‌క యేడాది పాటు గ్యాప్ తీసుకుని… త‌ర్వాత‌ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్ల‌ర్‌ సినిమాతో ఫాంలోకి వచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news