డబ్బులొస్తాయంటే చాలు.. మన తారలు ఎలాంటి ప్రోడక్ట్ అయినా అద్భుతమని చెప్పేస్తారు కదా! కథానాయకులుగా మంచి పేరున్న ప్రముఖులు కూడా యాడ్‌లు చేసేటప్పుడు కనీసం ఆలోచించట్లేదు. ఆ ప్రోడక్ట్ సామాన్యులకు ప్రయోజనకరమైందా.. లేక ఆరోగ్యం పాడు చేసేదా? అని ఆలోచించాల్సిన బాధ్యత వారిపై లేదా? సరిగ్గా ఇదేవిధంగా ఆలోచించాడు భోపాల్‌కు చెందిన ఓ సామాన్యుడు రాజ్‌కుమార్ పాండే. బాలీవుడ్ బాద్‌షా.. షారుక్ ఎండార్స్ చేస్తున్న ఓ షేవింగ్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల తన ముఖంపై రాషెస్ వచ్చాయని కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసు విచారించిన భోపాల్ కోర్టు.. షారుక్‌కు లీగల్ నోటీస్ పంపించింది.ఇండియా నంబర్ వన్ షేవింగ్ క్రీమ్ అంటూ షారుక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ.. రాజ్‌కుమార్ వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. ఈ క్రీమ్ వాడటం వల్ల తన ముఖంపై మచ్చలు వచ్చాయని, దీని కోసం భారీగా ఖర్చు చేసి ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నానని ఆయన వాపోయాడు. అతడి వాదన విన్న మెజిస్ట్రేట్ కాశీనాథ్.. షారుక్‌కు లీగల్ నోటీస్ పంపించారు. ఆయనతో పాటు ఆ షేవింగ్ క్రీమ్ ప్రోడక్ట్ ఓనర్, అది అమ్మిన స్థానిక షాప్ యజమాని, మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌కి కూడా నోటీసులు జారీ చేశారు.సదరు క్రీమ్‌ను మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్‌లో పరీక్షల కోసం పంపించగా.. నాసిరకమైందని తేలింది. ఇప్పుడిది ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.