కేజీయఫ్ సినిమా 2018 చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ బాహుబలిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత కన్నడ సినిమాకు కూడా బాలీవుడ్‌ను డామినేట్ చేసే దమ్ముంది ? అన్న ప్రశంసలు వచ్చేశాయి. కేజీయఫ్ కేవలం కన్నడం, సౌత్‌లో మాత్రమే కాకుండా.. అటు నార్త్‌లో.. హిందీ బెల్ట్‌లో కూడా కుమ్మి కుమ్మి వదిలింది. బాహుబలి 2 ఆ తర్వాత కేజీయఫ్ దెబ్బతో బాలీవుడ్ వాళ్లు సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటేనే గజగజలాడిపోయారు.
బాహుబలి లాగానే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక పార్ట్ మాత్రమే తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎప్పుడు అయితే రాజమౌళి బాహుబలిని రెండు పార్టులుగా రిలీజ్ చేసి బిజినెస్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడో అప్పుడు నీల్ కూడా కేజీయఫ్‌కు ఓ ముగింపు ఇచ్చి రెండో పార్ట్‌పై ఉత్కంఠ పెంచేశాడు. అయితే మూడేళ్లుగా కరోనా వల్ల ఈ సీక్వెల్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు వచ్చే నెల 14న పాన్ ఇండియా సినిమాగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.
కేజీయఫ్పై ఎలాంటి అంచనాలు లేవు. ఇప్పుడు అలా కాదు.. ఈ సీక్వెల్‌పై కనీవినీ ఎరుగని రేంజ్లో అంచనాలు ఉన్నాయి. సినిమా ఏ స్థాయిలో రికార్డులు బీట్ చేస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్లో నడుస్తోంది. పార్ట్ 1 రు. 100 కోట్ల లోపు ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు పార్ట్ 2 ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.
నిర్మాతలు తెలుగు వెర్షన్‌కు మాత్రమే రు. 70 కోట్లు కోడ్ చేశారట. అయితే ఆ మొత్తం చాలా ఎక్కువన్న దిల్ రాజు అటూ ఇటూ భేరం ఆడి చివరకు రు. 66 కోట్లకు పార్ట్ 2 తెలుగు వెర్షన్ రైట్స్ సొంతం చేసుకున్నారట. రెండో పార్ట్ ఓవరాల్‌గా రు. 240 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. కేవలం కన్నడంలోనే రు. 100 కోట్ల బిజినెస్ చేసిందట. అంత చిన్న ఇండస్ట్రీకి రు. 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు.
ఇక తమిళంలో రు. 30 కోట్లు, ఓవర్సీస్లో అన్ని భాషల్లో కలిపి రు. 80 కోట్లు కోట్ చేస్తున్నారట. రు. 240 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అంటే.. అన్ని భాషల్లో.. అన్ని ఏరియాల్లో కలిపి రు. 300 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.