Lifestyleతొలకరి కనిపించింది... మాయమైపోయింది

తొలకరి కనిపించింది… మాయమైపోయింది

ముందస్తు తొలకరి మురిపించి..ఆ తరువాత మరిచిపోయింది. మేఘాలు కమ్ముకొస్తూ అడపాదడపా కురుస్తున్న చిరు జల్లులు వర్షంగా మారకముందే మాయమైపోతోంది. ఈ చిరుజల్లులైనా ఒకచోట కురిస్తే మరోచోట కురువని పరిస్థితి. ఇక నల్లని మేఘాలను చూసి ఈరోజు ఏలాగైనా భారీ వర్షం కురుస్తుందని ఆశించిన రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు తలమానికమైన దిగువ మానేరు, ఎస్సారెస్పీ జలాశయాల్లో కొత్త నీరు వచ్చి చేరకపోగా, ప్రస్తుతం వాటిలో చారాన వంతు కూడా నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో అటు చెరువులు, కుంటలు నిండకపోగా, ఇటు వాగులు, వంకలు పొర్లలేదు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు అతి తక్కువ మండలాల్లో సాధారణ వర్షాపాతం నమోదు కాగా, ఎక్కువ మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.

ప్రస్తుతం ఆరుతడి పంటలకు కొంతమేర అనుకూలంగానే ఉన్నా..వరి సాగుపైనే అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో భూగర్భ జలాలే శ్రీరామ రక్షగా నిలువనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 4.27లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 2.67లక్షల హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. అయితే, తొలకరి వర్షాలు మురిపించి తరువాత మందగించాయి. జూలై మాసం నేటితో పూర్తవుతున్నా ఆశించిన మేర వర్షాలు కరువలేదు. తొలకరి వర్షాలతో వేసిన పత్తి, మొక్కజొన్న ఇప్పటికే కొద్దిగా పెరగగా, గత వారం రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పెరిగిన ఆ మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. మరో వారం పరిస్థితి ఇలాగే ఉంటే పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. ఇకపోతే మహారాష్టల్రో కురిసే వర్షాలపైనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎస్సారెస్పీ కింద ఉమ్మడి జిల్లాలో సుమారు 2.25లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. గతేడాది సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు ఎస్సారెస్పీ పూర్తిగా నిండడంతో రబీ పంటలకు నీరు వదలగా, ఉమ్మడి జిల్లాలో భారీగా ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో కేవలం 9టిఎంసిల నీరు మాత్రమే ఉంది.

మహరాష్టల్రో వర్షాలు పడితే ఎస్సారెస్పీ నిండి, ఇక్కడి నుంచి కాకతీయ కాలువ ద్వారా జిల్లాలోని దిగువ మానేరు జలాశయంకి నీరు చేరుతుంది. ఎల్‌ఎండి సామర్థ్యం 24టిఎంసిలు కాగా, ప్రస్తుతం 7 టిఎంసిల నీరు ఉంది. ఇకపోతే ఎల్లంపల్లిలో నీరు ఉన్నా..కాలువలు, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ పూర్తి స్థాయిలో లేక ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎల్లంపల్లి సామర్థ్యం 20.175 టిఎంసీలుగా కాగా, ప్రస్తుతం 10టిఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లి నుంచి నీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా కాలువలు, డిస్ట్రీబ్యూటరీ వ్యవస్థలను త్వరితగతిన పూర్తిచేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లాలోని
మరో మధ్య తరహా జలాశయమైన ఎగువ మానేరు నీరులేక వెలవెలబోతోంది. అయితే, ఇప్పటివరకు భారీ వర్షాలు లేక జలాశయాలు నిండకపోయినా..గతేడాది కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు నిండి భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆ భూగర్భ జలాలే పంటలకు శ్రీరామ రక్షగా నిలువనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news