యంగ్‌టైగర్ మొత్తానికి కొట్టేశాడు డబుల్ హ్యాట్రిక్. ఈ తరం జనరేషన్ హీరోల్లో ఎవ్వరికి సాధ్యం కాని విధంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు వరుస హిట్లతో తిరుగులేని డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. పాత్ర కోసం ఎంతకైనా కష్టపడే హీరో.. శరీరాన్ని పాత్రకు అనుగుణంగా మార్చుకునేందుకు ఎన్టీఆర్ ఎలాగైనా సాధన చేస్తాడు. ఇక ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేసేందుకు తాము చాలా కష్టపడాల్సి వస్తుందని ఎంతో మంది హీరోయిన్లు చెపుతుంటారు. ఇక ఎన్టీఆర్ గతంలో తాను కెరీర్ పరంగా పడిన ఇబ్బందులను ఓ వీడియోలో చెప్పారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ హిట్ అయిన వేళ ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్.. నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్‌కు కెరీర్ స్టార్టింగ్‌లో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్ సినిమా ఇచ్చింది జక్కన్నే. తర్వాత సింహాద్రి. ఇది ఎన్టీఆర్ కెరీర్‌ను తిరుగులేని విధంగా టర్న్ చేసింది. అయితే ఇదే సినిమా ఎన్టీఆర్‌కు దెబ్బేసింది కూడా.. ఈ విషయాన్ని ఎన్టీఆరే చెప్పారు.
సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఆ టైంలో ఎందుకో గాని ఎన్టీఆర్ కెరీర్ బాగా ఒడిదుడుకులకు లోనైంది. ఆ తర్వాత రాఖీ యావరేజ్ అయితే యమదొంగ మాత్రమే హిట్ అయ్యింది. ఆ టైంలో ఎన్టీఆర్ యమదొంగ తర్వాత తన కెరీర్ ఒడిదుడకుల గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తాను ఈ రోజు ప్రేక్షకుల మదిలో ఉండిపోయాను అంటే అందుకు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాయే అని.. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలతో తనకు హిట్లు వచ్చాయన్నాడు.
ఇక సింహాద్రి సినిమా తన కెరీర్‌ను ఎంత పైకి తీసుకు వెళ్లిందో అంతే కిందకు పడేసిందని చెప్పాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత తాను చేసిన సినిమాలు అన్ని నిరాశపరిచాయని.. ఇందుకు కారణం సింహాద్రి తర్వాత ప్రతి సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఉండడమే అని ఎన్టీఆర్ తెలిపాడు. ఇక ప్లాప్స్‌లో ఉన్న తనకు రాఖీ సినిమా చిన్న వెలుగు ఇచ్చిందని.. ఆ తర్వాత మళ్లీ యమదొంగ సినిమా చేస్తున్నానని చెప్పిన జక్కన్న తనతో ఆ సినిమా చేశాడని వెల్లడించాడు. ఆ సినిమా కోసం బరువు తగ్గాలని చెపితే కేవలం నాలుగు నెలల్లోనే బరువు తగ్గినట్టు చెప్పాడు.