మూడేళ్ల కష్టం.. రు. 500 కోట్ల బడ్జెట్.. రాజమౌళి అసాధారణ క్రియేటివి.. మరోవైపు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ మూడున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా కోసమే కష్టపడ్డారు. అసలు ఈ సినిమా చేస్తున్నంత సేపు మరో సినిమా ఆలోచన కూడా వీరు దరి చేరనీయలేదు. దీనిని బట్టే ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే సూపర్ టాక్ రావడంతో పాటు వసూళ్లు కూడా అదిరిపోయాయి. సినిమా ప్రీమియర్ షో అలా హైదరాబాద్‌లో పడిందో లేదో ఏపీలో షోలు పడకుండానే ఈ సినిమా యాక్షన్ సీన్లు, ఫైట్ సీన్లు. కీలక సీన్లు అన్ని కూడా వీడియోల రూపంలో వాట్సాప్ రూపంలో వైరల్ అయిపోతున్నాయి.
ఫస్ట్ డే హైదారబాద్ ప్రీమియర్ పడుతుండగానే.. అప్పుడే ఏపీలో, కర్నాటకలో హైదరాబాద్ నుంచి వచ్చిన వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నారు. ఏపీలో బెనిఫిట్ షో చూసేవాళ్లు కూడా ఆ వీడియోలను తమ సెల్‌ఫోన్లలో ముందుగానే వీక్షించేస్తున్నారు. కొన్ని వీడియోలు అయితే ఓవర్సీస్ థియేటర్ల నుంచి కూడా వచ్చేశాయి. నిన్న సినిమా చూడని వాళ్లు.. టిక్కెట్లు దొరకని వాళ్లు అందరూ కూడా ఈ వీడియోలు చూసి ఎంజాయ్ చేశారు. కొందరు సెల్ ఫోన్లలో అయితే బిట్లు బిట్లుగా ముఖ్యమైన పార్టులు అన్ని బయటకు వచ్చేశాయి.
ఇలా అయితే సినిమా రెండు, మూడు సార్లు చూడాలన్న ఆసక్తి ఉన్న వారు ఒక్కసారితో సరిపెట్టేసుకుంటారు. అంతిమంగా ఇది బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతుంది. బాహుబలి సీరిస్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం.. ఆ సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువుగా వచ్చారు. పల్లె జనాలు.. పెద్ద వాళ్లు కూడా .. ఇంకా చెప్పాలంటే మహిళలు కూడా రెండు మూడు సార్లు ఈ సినిమాలను చూశారు. అయితే ఇప్పుడు ఈ వీడియోల బయటకు వచ్చేయడంతో రిపీటెడ్ ఆడియెన్స్ తక్కువుగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇదే జరిగితే సినిమా వసూళ్లు తగ్గడంతో పాటు లాంగ్ రన్ తగ్గుతుంది.
పైగా ఇది విజువల్ ఫీస్ట్.. 10 రోజుల వరకు టిక్కెట్ రేట్లు ఎక్కువే. ఇంత పెద్ద మొత్తం పెట్టి ఇప్పుడు ఎందుకులే సినిమా చూడడం అనుకుని.. సెల్‌ఫోన్లలో ఈ వీడియోలు చూసి కాలం గడిపేస్తే అది నిర్మాతలకు, సినిమా కొన్న బయర్లకు ఎంత నష్టం ? అన్నది చూస్తే పెద్ద నష్టం తప్పదు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండడంతో త్రిబుల్ ఆర్ టీం ఓ ఐటీ సంస్థ ద్వారా వీటిని డిలీట్ చేయిస్తోంది. అయినా ఎన్ని వీడియోలు డిలీట్ చేసినా మళ్లీ బయటకు కొత్త కొత్త వీడియోలు వచ్చేస్తున్నాయి. మరి దీనికి బ్రేక్ వేయకపోతే నష్టం తప్పదు మరి..!