ఔను! సినీ రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు చాలా చిత్రంగా విచిత్రంగా కూడా ఉంటాయి. 1950-80 ల వరకు కూడా తెలుగు,తమిళ సినీ రంగాలను ఏలిన మహానటి సావిత్రి విషయంలో జరిగిన ఘటన ఒకటి.. ఇండస్ట్రీలో చాన్నాళ్లు చర్చకు వచ్చింది. దీనికి కారణం.. ఒకానొక సందర్భంలో… అన్నగారు ఎన్టీఆర్.. సావిత్రితో తాను నటించనని చెప్పారట. అయితే ఆమెకు నేరుగా కాకుండా.. నిర్మాతలకు, దర్శకులకు చెప్పడం.. అప్పట్లో ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది.
దీనిపై గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న తన జీవిత చిత్రలో స్పష్టంగా పేర్కొన్నారు. “నాకు ప్రత్యేకంగా కారణం తెలియదు కానీ.. ఎన్టీఆర్ ఆ తర్వాత.. నుంచి సావిత్రితో నటించడం మానేశాడు“ అని గుమ్మడి పేర్కొన్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ – సావిత్రి జంట గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఏ రోల్ పోషించినా.. సక్సెస్ . హీరో హీరోయిన్లుగానే కాకుండా.. అన్నా చెల్లెళ్లుగా (రక్తసంబంధం) కూడా నటించి రక్తి కట్టించారు. ఇక, గుండమ్మ కథ వంటిమాస్ మూవీల్లో ఇరగదీశారు.
ఇలా.. మొత్తం అన్నగారితో సావిత్రి చాలా సినిమాలు చేశారు. అయితే.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరిసినిమా దేవత. ఆ తర్వాత.. వీరిద్దరూ కలిసి నటించలేదు. దీనికి కారణంపై అప్పట్లో చాలా మంది చెప్పుకొనేవారు. అన్నగారే.. సావిత్రిని రిజెక్ట్ చేశారని.. అందుకే ఇద్దరి కాంబినేషన్‌లో మూవీలు రావడం లేదని.. పెద్ద ఎత్తున చర్చ సాగింది. నిర్మాతలు, దర్శకులకు అన్నగారు ఈ విషయం స్పష్టం చేశారని కూడా చర్చగా మారింది.
ఇక, ఈ విషయంపై ఇప్పటి వరకు గుమ్మడి రాసిందే ఫైనల్. కారణం అయితే.. ఇప్పటికీ తెలియదు. అయితే.. ఒకరిద్దరు చేసుకున్న చర్చల్లో సావిత్రి `వ్యాపకాలే` అన్నగారికి ఆగ్రహం తెప్పించాయని అంటారు. ఆ వ్యాపకాలను తగ్గించుకోవాలని ఆమెకు చెప్పి చూశారని.. అయితే ఆమె వినలేదని అంటారు. వాస్తవంగా కూడా ఆ వ్యాపకాలు, వ్యసనాలతోనే ఆమె కెరీర్ పతనం అయ్యింది.
తాను ఎంతో చెప్పినా వినలేదన్న కారణంతోనే సావిత్రితో నటించనని నిర్మాతలకు చెప్పారని అంటారు. మరి ఏదేమైనా.. తర్వాత కాలంలో సావిత్రి నటించినా.. అన్నగారితో మాత్రం కాకపోవడం గమనార్హం. అయితే ఆ తర్వాత కాలంలో ఆమె ఏఎన్నార్‌కు బాగా దగ్గరయ్యారు. ఏఎన్నార్ కూడా ఆమె వ్యసనాలపై ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ వచ్చినా ఆమె పట్టించుకోలేదు.