కొన్ని ఉద్వేగాలకు కారణం ఉండదు… చనిపోయిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌పై కన్నడ సినీ జనాలు, సినీ అభిమానులు మాత్రమే కాదు.. ఓవరాల్‌గా కన్నడ జనాలు అందరూ విపరీతమైన ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. అసలు పునీత్ అనేవాడు సగటు కమర్షియల్ హీరో చేసే ఫైట్లు, డ్యాన్సుల సినిమాలు చేసి ఇంతరాదాభిమానాలు పొందలేదు. అతడి సినిమాల్లో చాలా వరకు రెగ్యులర్ సినిమాలే. అయితే అతడి గుణగణాలు.. అతడి వ్యక్తిత్వం.. అతడి సేవ.. సమాజంపై ఉన్న ప్రేమ.. తోటి మనుషుల పట్ల ఉండే హుందాతనం.. మానవత్వమే ఇవన్నీ అతడిని మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రత్యేకమైన స్టార్ హీరోగా నిలబెట్టాయి.
అతడు చనిపోయి రోజులు గడుస్తున్నాయి. తాజాగా అతడి జయంత కానుకగా ఈ నెల 17న అతడు నటించిన చివరి చిత్రం జేమ్స్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం కన్నడ ఇండస్ట్రీతో పాటు కన్నడ జనాలు అందరూ ఆసక్తితో ఎదురు చూశారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌ను పెద్ద పండగలా జరుపుకుంటున్నారు. జేమ్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 భాషల్లో 4 వేల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి వసూళ్లే వస్తున్నాయి.
అసలు సినిమా ఎలా ఉంది ? ఆ టాక్ ఏంటన్నది చర్చించుకోవాల్సిన విషయమే కాదు.. చనిపోయాక కూడా పునీత్‌కు లభిస్తోన్న ఆదరణ.. ఆ సినిమాను ప్రేక్షకులు చూస్తోన్న విధానమే గొప్ప. అసలు పునీత్‌కు వస్తోన్న ఆదరణ చూస్తుంటే.. అతడి తండ్రి దివంగత కన్నడ కంఠరీవ రాజ్‌కుమార్‌కు కూడా ఇంత గొప్ప ఆదరణ రాలేదేమో అనిపించేలా ఉంది. కన్నడ నాట ఈ నెల 25వ తేదీ వరకు ఏ థియేటర్లోనూ మరే సినిమా వేయకూడదని తీర్మానాలు చేశారు. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే ఆడుతుంది.
ఈ సినిమాలో పునీత్ ఇద్దరు సోదరులు గెస్ట్ రోల్స్ చేశారు. శివరాజ్‌కుమార్ అయితే కొన్ని సీన్లకు డబ్బింగ్ చెప్పారు. ఇక కొన్ని సీన్లు షూట్ చేయడానికి ముందు పునీత్ చనిపోవడంతో గ్రాఫిక్స్‌తో మేనేజ్ చేశారు. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కటౌట్లు, థియేటర్లకు ముస్తాబులు.. పాలాభిషేకాలు.. బాణసంచాలు, సీరియల్ బల్పులు, ఉచిత అన్నదానాలు, రక్తదాన శిబిరాలు హంగామా మామూలుగా లేదు. కర్నాటకలో ఓ ఉద్వేగం బలంగా కనిపిస్తోంది.
అన్నింటికి మించి ప్రతి థియేటర్లోనూ 17వ నెంబర్ సీటు ఖాళీగా ఉంచుతున్నారు. ఇది స్టేట్ వైడ్‌గా అన్ని థియేటర్లలోనూ అమలు చేస్తున్నారు. పునీత్ వస్తాడట.. ఆ సీట్లో ప్రేక్షకులు, తన అభిమానుల మధ్య కూర్చొని ఆ సినిమాను ఎంజాయ్ చేస్తాడట. అసలు ఇలాంటి అభిమానం దేశంలో మరే హీరో పొందలేదంటే నిరూపమానం. బెంగళూరులో ఓ థియేటర్లో అయితే ఉదయం 6 గంటల షోకు ఛాయ్, బిస్కెట్లు, 10 గంటల షోకు దోసెలు, 1 గంట షోకు చికెన్ బిర్యానీ, 4 గంటల షోకు సమోసాలు, 7 గంటల షోకు వెజ్ మంజూరియా ఇస్తున్నారు. ఏదేమైనా పునీత్ ఎప్పటకీ ధన్యజీవి.. పునీత్ అంటే పునీతే..!