రెబల్‌స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూడేళ్ల పాటు ఊరించి ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. రు. 300 కోట్లు బడ్జెట్.. ఇటలీలో వేసిన 104 సెట్లు… సినిమా అంతా భారీతనం ఇలా ఎన్నో ప్రత్యేకతలతో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ వీరాభిమానులకే నచ్చలేదు. సినిమా మంచి ప్రేమకథ అయినా ప్రభాస్ అభిమానులే నచ్చే సినిమా కాకపోవడం.. ప్రభాస్‌ను ఓ యాక్షన్ హీరోగా ఊహించుకుంటే.. కంప్లీట్ లవర్‌బాయ్‌గా చూపించడం చాలా మందికి నచ్చలేదు. ఇవన్నీ ఒక మైనస్ అయితే.. కథ చాలా స్లోగా సాగడం… ప్రభాస్ – పూజ మధ్య కూడా అనుకున్న రేంజ్లో కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోవడం లాంటి కారణాలు ఈ సినిమాపై బాగా ఇంపాక్ట్ చూపించాయి. ఇదే సినిమా నెగిటివ్ టాక్‌కు ప్రధాన కారణమైంది.
ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ మూడేళ్లుగా ఎన్నో ఆశలతో వెయిట్ చేసినా రాధేశ్యామ్ సినిమా ఇంత నిరాశ పరుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. సినిమా ఎంత బడ్జెట్ పెట్టినా.. విజువల్స్ పరంగా ఎంత రిచ్‌గా ఉన్నా.. అంతిమంగా బాక్సాఫీస్ లెక్కలే సినిమా స్థాయిని నిలబెడతాయి. అక్కడే రాధేశ్యామ్ అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాకు మరో వీకెండ్ మాత్రమే ఉంది. ఈ లోగానే ఏదైనా రాబట్టుకోవాలి. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ థియేటర్లలోకి వస్తే రాధేశ్యామ్ గురించి ఎవ్వరూ పట్టించుకోరు.
రాధేశ్యామ్ డిజప్పాయింట్ చేయడంతో ఇప్పుడు ప్రభాస్‌తో పాటు ప్రభాస్ అభిమానుల ఆశలు అన్నీ సలార్ మీదే ఉన్నాయి. సలార్ ఈ యేడాది థియేటర్లలోకి వచ్చేస్తుందనే అందరూ ఆశలతో ఉన్నారు. కానీ వాస్తవంగా చూస్తే సలార్ రన్ టైం పెరగడంతో దీనిని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాను రెండు పార్టులుగా మలిచారు. ఇప్పుడు సలార్‌ను కూడా రెండు పార్టులుగా మలిస్తే బడ్జెట్ పరంగా వర్కవుట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
ఎప్పుడు అయితే రెండు పార్టులుగా తీయాలని అనుకున్నారో అప్పుడు షూటింగ్ మరింత పెరుగుతోందట. మరోవైపు ఏప్రిల్‌లో కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లు ఏప్రిల్ వరకు ఉంటాయి. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ – ప్రభాస్ సలార్ షూటింగ్ చేస్తారు. ఇక రెండు భాగాలుగా మార్చాలని అనుకుంటోన్న నేపథ్యంలో ఈ దసరాకు అయితే రిలీజ్ లేదనే తెలుస్తోంది. ఇక వచ్చే సంక్రాంతికి ఆదిపురుష్ ఉంది.. ఆ తర్వాతే సలార్ ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ డిజప్పాయింట్ అవ్వడంతో ఈ యేడాది సలార్ రిలీజ్ అయితే అదైనా సూపర్ హిట్ అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ యేడాది ప్రభాస్ మరో సినిమా వచ్చే పరిస్థితి లేదు. సంక్రాంతి వరకు ఆగాల్సిందే. సంక్రాంతికి ఆదిపురుష్ ఉన్నా.. ఆ సినిమా కంటే కూడా సలార్ మీదే నమ్మకాలు ఎక్కువుగా ఉన్నాయి. అంటే వచ్చే సమ్మర్ వరకు సలార్ 1 కోసం వెయిట్ చేయాల్సిందే..!