Moviesఅస‌లు సిస‌లు బాల‌య్య ద‌మ్మేంటో చూపించిన అఖండ‌... క‌ర్నూలులో 100 రోజుల...

అస‌లు సిస‌లు బాల‌య్య ద‌మ్మేంటో చూపించిన అఖండ‌… క‌ర్నూలులో 100 రోజుల పండ‌గ‌..!

నందమూరి నట సింహం బాలకృష్ణకు సరైన కథ ఉన్న సినిమా పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మంగమ్మగారి మనవడు లాంటి సినిమాలు ఆ రోజుల్లోనే సంవత్సరంపాటు ఆడాయి. ఇక 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహా రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ అంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. ఇక 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహనాయుడు సినిమా భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా వంద కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా రికార్డులకు ఎక్కింది. అప్పటివరకు దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌లేదు.

తొలిసారిగా ఈ గొప్ప రికార్డు బాలయ్య ఖాతాలో పడింది. ఈ సినిమా సాధించిన ఘన విజయం చూసి బాలీవుడ్ సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నరసింహనాయుడు సినిమా తర్వాత 2004 సంక్రాంతి కానుకగా వచ్చిన లక్ష్మీనరసింహ సైతం 277 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా – లెజెండ్ రెండు సూపర్ హిట్ అయ్యి బాలయ్య స్టామినా ఏంటో నిరూపించాయి. ఇక బాలయ్య కెరీర్లో వందో సినిమా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సైతం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చారిత్రాత్మక కథాంశంలో సైతం బాలయ్య శాతకర్ణి మహారాజుగా అలా ఒదిగిపోయారు.

తాజాగా కరోనా రెండవ తర్వాత పెద్ద పెద్ద హీరోలు సైతం థియేటర్లలో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు భయ పడుతున్న వేళ బాలయ్య డేర్ చేసి డిసెంబర్ 2న తన అఖండ సినిమా రిలీజ్ చేశారు. అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండ గర్జనలా వెలిగిపోయింది. ఇంకా చెప్పాలంటే.. క‌రోనాకు ముందు కరోనా తర్వాత బాక్సాఫీస్ దగ్గర అఖండ సినిమా అదిరిపోయే గీత గీసింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా నా రెండో వారం పోస్టర్స్ చూస్తేనే గొప్ప అన్నట్టుగా ఉంది. అలాంటిది అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. థియేట్రికల్ నుంచే ఏకంగా రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన అఖండ ఓవరాల్‌గా రు. 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.

నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్‌గా శత దినోత్సవం జరుపుకుంటున్న అఖండ సినిమా వంద రోజుల పండుగ ఈనెల 12వ తేదీన కర్నూలు ఎస్టీబిసి గ్రౌండ్ లో జరగనుంది. ఈ వంద రోజుల పండుగ కు ముఖ్య అతిథిగా బాలయ్యతో పాటు అఖండ టీమ్ అంతా హాజరు కానుంది. డైరెక్ట్ గా నాలుగు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంటున్న అఖండ.. షిఫ్టుల‌తో కలిపి మొత్తం ఏడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటోంది. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా వంద రోజులు ఆడటమే గొప్ప అనుకుంటే… అలాంటిది అఖండ ఏడు కేంద్రాల్లో 100 రోజులు ఆడటం గ్రేట్ అని చెప్పాలి. ఏదేమైనా క‌రోనాకు ముందు… కరోనా తర్వాత అఖండ అనేది బాక్సాపీస్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ధైర్యంతోనే మిగిలిన హీరోలు కూడా… తమ సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news