టాలీవుడ్ లో విడాకుల పరంపర నడుస్తుంది. గతేడాది చివర్లో అక్కినేని నాగచైతన్య – సమంత జంట విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. వీరు విడాకులు తీసుకుని నాలుగైదు నెలలు అవుతున్నా ఈ జంట విడాకుల విషయం ఇప్పటకీ ప్రతి రోజూ వార్తల్లో ఉంటూనే వస్తోంది. ఈ విడాకుల విషయం ఇంకా వార్తల్లో నానుతుండగానే.. ఇప్పుడు మరో జంట సైతం విడాకులకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ జంట కొన్నేళ్ల క్రితం వచ్చిన యూత్ ఫుల్ కాలేజ్ మల్టీస్టారర్ సినిమాలో సదరు హీరో నటించారు. ఆ తర్వాత సదరు హీరో సోలోగా కొన్ని సూపర్ హిట్లు కొట్టి హిట్ సినిమాలు కొట్టాడు. ఓ థ్రిల్లర్ సినిమాతో పాటు మరో సినిమాలో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు సొంతం చేసుకున్నాడు. ఆ కుర్ర హీరో కరోనా టైంకు ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని.. కరోనా టైంలో చాలా సింపుల్‌గానే 2020లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు.
యేడాది పాటు బాగానే సాగిన వీరి వైవాహిక బంధం ఇప్పుడు బీటలు వారిందని.. వారు విడాకుల దిశగా వెళుతున్నారని.. సదరు హీరో సన్నిహిత వర్గాల ద్వారా మ్యాటర్ బయటకు వచ్చేసింది. దాదాపుగా ఈ విడాకుల వార్త సంక్రాంతికి ముందు నుంచే లీక్ అయినా ఎవ్వరూ నమ్మలేదు. ఇక త్వరలోనే వీరు అధికారికంగా విడాకులకు రెడీ అవుతున్నారని.. త్వరలోనే మ్యాటర్ బయటకు వస్తుందని అంటున్నారు.
వాస్తవానికి కొద్ది నెలలుగా వీరు కలిసే ఉండడం లేదట. ఇరు వైపు కుటుంబాలు వీరిని కలిపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరు వినకపోవడంతో చివరకు వారికే నిర్ణయాన్ని వదిలేశారట. ముందు వీరి మధ్య ఏవో చిన్న చిన్న స్పర్థలే ఉంటాయని అనుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరు మ్యూచువల్ డైవర్స్‌కు అప్లై చేశారు. ఇటీవలే ఆ హీరో కెరీర్ కూడా స్లో అయ్యింది. ఇందుకు కారణం ఆ హీరో వ్యక్తిగతంగా ఎదుర్కొంటోన్న ఇబ్బందులే అంటున్నారు.