సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేయడం.. ఆ కథతో మరో హీరో సినిమా చేసి సూపర్ హిట్లు కొట్టడం జరుగుతూ ఉంటుంది. తీరా ఆ సినిమా హిట్ అయ్యాక.. ఆ కథ రిజెక్ట్ చేసిన హీరో అర్రే మనం మిస్ అయ్యామే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా హిట్ సినిమాలు మిస్ చేసుకున్న వారిలో టాప్ లిస్టులో జూనియర్ ఎన్టీఆరే ఉంటాడు. ఎన్టీఆర్ వదులుకున్న ఎన్నో కథలు ఆ తర్వాత వేరే హీరో చేస్తే అవి సూపర్ హిట్ అయ్యాయి.
ఇక రెండు దశాబ్దాల క్రితం మహేష్‌బాబు ఓ అందమైన ప్రేమకథను వదులుకున్నాడు. 2001లో దివంగత ఉదయ్ కిరణ్ – రీమాసేన్ జంటగా మనసంతా నువ్వే సినిమా వచ్చింది. అప్పటికే నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాతో ఉదయ్‌కిరణ్ దూసుకుపోతున్నాడు. ఆ సినిమా థియేటర్లలో 100 రోజులకు పరుగులు తీస్తుండగానే మనసంతా నువ్వే వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు 175- 200 రోజులు ఆడింది. అలా ఒకేసారి రెండు సూపర్ హిట్ సినిమాలతో అప్పట్లో ఇండస్ట్రీలో ఉదయ్‌కిరణ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు.
ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ముందుగా మహేష్‌బాబుతో తెరకెక్కించాలని అనుకున్నాడు. మహేష్‌కు కథ కూడా చెప్పాడు. ఎందుకంటే అప్పటికే మహేష్‌బాబు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత ఎంఎస్. రాజుకు డేట్లు ఇచ్చారు. ఆ బ్యానర్లో మహేష్ హీరోగా ఈ సినిమా తీయాలని అనుకున్నారు. అయితే ఈ కథ మహేష్‌కు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు. వెంటనే ఈ కథ ఉదయ్ కిరణ్‌కు వినిపించడం.. ఓకే చేయడం జరిగిపోయాయి. అలా ఆ సూపర్ హిట్ సినిమా మహేష్ ఖాతా నుంచి చేజారి ఉదయ్‌కిరణ్ ఖాతాలో పడింది.
అయితే ఆ తర్వాత అదే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో మహేష్‌బాబు ఒక్కడు సినిమా చేశాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పాటు అప్పటి వరకు తెలుగులో ఉన్న రికార్డుల్లో చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. ఆ రోజుల్లోనే ఒక్కడు ఒక్క హైదరాబాద్‌లోనే 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఓవరాల్‌గా 130 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. మహేష్‌బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమాగా ఒక్కడు రికార్డులకు ఎక్కింది.