విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య దైవం.. నందమూరి తారకరామారావు నటించిన సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన హీరోగా ఉంటేచాలు.. సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు సెంటిమెంటు కూడా చూసుకునేవారు కారట. ప్రస్తుతం ఉన్నఅగ్ర నటుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వీరు తమ సినిమాలు విడుదల చేసేందుకు పండగలు, సెలవులు వచ్చేలా చూసుకుంటున్నారు. అంతేకాదు.. పొరుగు రాష్ట్రంలో ఎవరైనా.. సినిమా విడుదల చేస్తే.. ఆ సినిమా ప్రభావం తమపై ఎక్కడ పడుతుందో అని బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో సినిమా డేట్లను కూడా మార్చుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక, కరోనా ప్రభావంతో అయితే..అగ్ర నటులు కూడా సినిమాల విడుదలను ఆపుకున్నారు. అయితే.. అన్నగారి స్టయిల్ వేరు. ఎవరెవరి సినిమాలు విడుదల అవుతున్నాయి? ఏయే పండగలు వస్తున్నాయి.. అని చూసుకునేవారు కారట. అంతేకాదు.. నిర్మాతలకు కూడా ఆయన అదే చెప్పేవారట. “సార్ ఇప్పట్లో పండగలు ఏవీలేవు.. సినిమా పోతుందా?“ అన ఎవరైనా సందేహం వ్యక్తం చేస్తే.. “ఏంటి బ్రదర్.. మన సినిమా విడుదలే పెద్ద పండగ. దీనికి ప్రత్యేకంగా పండగలు కావాలా? “ అని ఎదురు ప్రశ్నిచడంతోపాటు.. సినిమాను పూర్తయ్యాక.. ఎప్పుడు విడుదల చేస్తున్నారు.. అంటూ.. వారి వెంట పడేవారట.
అంతేకాదు.. పోటాపోటీగా సినిమాలు విడుదల చేసేందుకు నేటి తరం ఇబ్బంది పడుతుంటే.. అప్పట్లో అన్నగారు.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు పోటీ పడి సినిమాలు రిలీజ్ చేసేవారట. ఇలా ఒకే డేట్‌లో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలైన సందర్భాలు అనేకం ఉన్నాయని.. అవి సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయని.. పలువురు చెప్పుకోవడం తెలిసిందే. అన్నగారి సినిమా అంటే.. ఎంత దూరం అయినా.. కాలినడకనో.. బళ్లు కట్టుకునో వెళ్లి చూసిన సందర్భాలు ఇప్పటికీ ఆ తరం వారు చర్చించుకుంటూనే ఉంటారు. ఇదీ.. నేటికీ..నాటికీ.. ముఖ్యంగా అన్నగారి హయాం కు ఉన్న తేడా అంటున్నారు పరిశీలకులు.