సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటారు. అలాగే ఒక హీరో కథ నచ్చక రిజెక్ట్ చేస్తే… అదే కథతో మరో హీరో సినిమా చేస్తే డిజాస్టర్ కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ముందుగా తమ వద్దకు వచ్చిన కథలను వదులుకున్న హీరోలు సూపర్ హిట్ లు మిస్ అవుతూ ఉంటారు.. అలాగే డిజాస్టర్లు కూడా తప్పించుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తన కెరీర్లో 500కు పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా… క్యారెక్టర్ ఆర్టిస్టుగా… సహాయ దర్శకుడిగా నిర్మాతగా, హీరోగా ఇలా ఎన్నో పాత్రల్లో మోహన్‌బాబు మెప్పించారు.
మోహన్ బాబు మనసులో ఏది అనుకుంటే అది నిక్కచ్చిగా పైకి చెప్పేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో మహామహులను సైతం మోహన్‌బాబు లెక్కచేయరు. ఆయన కెరీర్లో ఎన్నో సార్లు ఎత్తుపల్లాలను చూశారు. వరుస ప్లాపులు వచ్చిన సమయంలో కూడా ఒక్క సూపర్ హిట్ సినిమాతో తనేంటో ఫ్రూవ్ చేసుకునేవారు. మోహన్ బాబు వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును ఒక సినిమా చేసి పెట్టాలి అని అడిగారు. అంతకుముందు కూడా వరుస ప్లాపులతో ఉన్న రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు.
అప్పట్లో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు జగదేకవీరుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మోహన్‌బాబుతో సినిమా ఎందుకు ? పైగా అది కూడా రీమేక్.. ఆ సినిమా చేస్తే నీ కెరీర్‌కు ప్రాబ్లం అవుతుంది… చేయవద్దని రాఘవేంద్రరావుకు చెప్పారట. అయినా రాఘవేంద్రరావు కసితో అల్లుడుగారు సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన అల్లుడుగారు మోహన్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే అల్లుడుగారు సినిమాను ముందుగా బాలకృష్ణ తో చేయాలని అనుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సినిమా చిత్రంకు రీమేక్ గా అల్లుడుగారు వచ్చింది. 1988లో మలయాళంలో మోహన్ లాల్ – రంజని ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం సినిమాకు సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.
అప్పట్లో 300 రోజులు ఆడిన ఈ సినిమా మోహన్‌లాల్ సినిమా కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా రీమేక్ హక్కులను సీనియర్ నటి సుహాసిని మేనేజర్ సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ హీరోగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే బాలకృష్ణకు కథ నచ్చక పోవడంతో ఆయన వద్దనుకున్నారు. ఆ తరువాత చిత్రం రీమేక్ రైట్స్ చేతులు మారి మోహన్ బాబు వద్దకు వెళ్లాయి. అలా మోహన్ బాబు అల్లుడుగారు సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. రమ్యకృష్ణ – శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సెంటిమెంట్ అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది.