మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్లో నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నారు. చిరంజీవి వేసిన చిన్న విత్తనంతోనే ఈ రోజు మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో మహా వృక్షంలా ఎదిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది హీరోలు ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇప్పుడు సగం మెగా ఫ్యామిలీదే అన్నట్టుగా ఉంది. సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న చిరు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.. కేంద్ర మంత్రి అయ్యారు.
ఇన్నేళ్ల జీవితంలో చిరంజీవి భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోగా చిరంజీవి రికార్డులకు ఎక్కారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు సినిమాకు చిరు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక చిరంజీవికి హైదరాబాద్ – బెంగళూరు – వైజాగ్ – చెన్నై – విజయవాడ నగరాల్లో ఖరీదైన భవనాలు, స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ బహిరంగ మార్కెట్లోనే కోట్లలో ఉంటుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రాకముందు చిరు ఫ్యామిలీ అంతా చెన్నైలోనే ఉండేది. అప్పుడే అక్కడ చిరంజీవి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టేశారు. చెన్నై, హైదరాబాద్‌లో చిరుకు విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిరు ఉంటోన్న ఇళ్లు కూడా చాలా విలాసవంతమైందే..! ఇక చిరంజీవి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ రియల్ ఎస్టేట్‌లో భారీగానే పెట్టుబడులు పెట్టారు.
అలాగే మొగల్తూరు లో తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిలో ఇప్పటికి ఉమ్మడి వ్యవసాయ భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు చెన్నైలోనూ వ్యవసాయ భూములు కోనుగోలు చేశారు. ఇక ఒక్క హైదరాబాద్‌లోనే జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కోకాపేట, ఫిల్మ్‌నగర్, మణికొండ ఏరియాల్లో విలువైన భూములు, ప్లాట్లు ఉన్నాయి. ఇక చిరు సతీమణి సురేఖ పేరిట కూడా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి.
ఇక చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టం. చిరంజీవి దగ్గర చాలా మోడల్స్ కార్లు ఉన్నాయి. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారు గురించి చిరు తెలుసుకునేందుకు ఇష్టపడతారు. ఇక చిరు కుమారుడు రామ్‌చరణ్ సైతం తండ్రికి బహుమతుల రూపంలో చాలా కార్లు ఇస్తూనే ఉంటారు. ఇక చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రకటించిన ఆస్తుల ప్రకారం తన దగ్గర, తన భార్య దగ్గర ఉన్న బంగారం – వెండి – వజ్రాల విలువ సుమారు 10 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రకటించారు.
ఇక బ్యాంక్ అక్కౌంట్స్, ఇతర సేవింగ్స్ ప్రకారం రు. 20 కోట్ల ఆస్తులు ఉంటాయని ప్రకటించారు. అవన్నీ ఆ రోజు లెక్కల ప్రకారం.. అయితే ఇప్పుడు వాటి విలువ ఇప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువే ఉంటాయని చెప్పాలి.