పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమా చేస్తున్నాడు. వరుసపెట్టి రీమేక్ సినిమాలు చేసేందుకే ఎక్కువుగా ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసేందుకే ఇష్టపడే పవన్‌లో ఈ మార్పు ఏంటో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఆ రీమేక్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా పవన్ పదే పదే అవే చేస్తున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో కేవలం 23 సినిమాలు మాత్రమే చేసిన పవన్‌కు తిరుగులేని క్రేజ్, మార్కెట్ ఉంది.
అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు రాజకీయాల్లోకి వచ్చి కూడా ప్రజలకు మరింత దగ్గర అవుతున్నాడు. పవన్ ఒకానొక టైంలో వరుస హిట్లతో అప్పటి స్టార్ హీరోలకే చెమటలు పట్టించేశాడు. ఖుషీ వరకు పవన్ ను ఆపేవాళ్లే లేరు. జానీ నుంచి పవన్ కెరీర్ డల్ అయ్యింది. ఆ దెబ్బకు మళ్లీ గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు వరుసగా హిట్ అయ్యే వరకు పవన్ కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అయితే పవన్ గతంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలను చేజేతులా వదులుకున్నాడు. అవి కూడా పవన్ ఖాతాలో పడి ఉండే పవన్ కెరీర్ మరో రేంజ్‌లోనే ఉండేది. ఆ హిట్ సినిమాలు ఏంటో చూద్దాం.
ఇడియట్ :
పూరి జగన్నాధ్ ఈ సినిమా కథ ముందుగా పవన్ కళ్యాణ్‌కే చెప్పారు. ఎందుకంటే పూరికి ముందుగా డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి.. బద్రితో డైరెక్టర్‌ను చేసింది పవనే కాబట్టి.. ఆ కృతజ్ఞతతో పూరి ఈ కథను పవన్‌కే చెప్పారు. ఇడియట్ స్టోరీ కూడా పూరి పవన్ కోసమే రాసుకున్నారు. అయితే పవన్ ఈ కథ తనకు సూట్ కాదని ఒప్పుకోకపోవడంతో చివరకు రవితేజతో చేసి హిట్ కొట్టాడు.
అమ్మ నాన్న ఓ తమిళఅమ్మాయి :
2002లో ఇడియట్ రాగా.. వెంటనే పూరి అమ్మ నాన్న ఓ తమిళఅమ్మాయి కథ రాసుకున్నాడు. ఈ కథ బాగా వచ్చిందని.. సూపర్ హిట్ అవుతుదని పూరి ముందే అంచనా వేసుకున్నాడు. అయితే ఈ కథ బాగున్నా.. తాను అంతకు ముందే చేసిన తమ్ముడు సినిమా స్టైల్లో ఉందని చెప్పి పవన్ వదులుకున్నాడు. దీంతో 2003లో మళ్లీ రవితేజతో చేసి మరో హిట్ కొట్టేశాడు.
నువ్వేకావాలి :
2000లో వచ్చి యావత్ ఆంధ్రాదేశాన్ని ఓ ఊపు ఊపేసింది నువ్వేకావాలి. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను పవన్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్గా చెప్పాలని ఉంది టైటిల్‌తో తీయాలని అనుకున్నారు. ఫొటో షూట్ కూడా స్టార్ట్ అయ్యింది. కొన్ని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత ఇదే స్టోరీని తరుణ్, రీచా జంటగా నువ్వేకావాలిగా తీస్తే ఆ సినిమా ఏకంగా సంవత్సరం ఆడింది.
గజని – పోకిరి – అతడు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – సీతారామరాజు – గోలీమార్ – మిరపకాయ్ – తుపాకీ – ఖైదీనెంబర్ 150 వంటి సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు.ఇందులో కొన్ని సినిమాలు పవన్ చేసినా పవన్ రేంజ్ మరోలా ఉండేది.