యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా భీభత్సం బాక్సాపీస్ దగ్గర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడడం ఒక రికార్డు అయితే కేవలం థియేట్రికల్‌గా రు. 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ వసూళ్లు కూడా కలుపుకుంటే అఖండ రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇది మామూలు రికార్డు కాదనే చెప్పాలి.
ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన అఖండ అక్కడ కూడా దుమ్ము దులిపేస్తోంది. అఖండ ఓటీటీలోకి వచ్చినా కూడా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో రన్ అవుతోంది. ఇంకా మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. సీడెడ్‌లో అయితే చాలా కేంద్రాల్లో అఖండ ఆడుతోన్న థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. నైజాంలో పలు చోట్ల ఇప్పుడు అఖండను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. కొత్త థియేటర్లు కూడా యాడ్ అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అఖండ అదిరిపోయే రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా ఆడుతోన్న సుదర్శన్ థియేటర్లోనే అఖండ 50 రోజుల సెలబ్రేషన్స్ చేశారు. పైగా ఆ రోజు అఖండ యూనిట్ ఇక్కడకు వచ్చి మరీ సినిమాను ఎంజాయ్ చేసింది. ఆ రోజు కూడా అఖండ రు. 2లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు ఈ థియేటర్లో కోటి రూపాయల వసూళ్లు రాబట్టింది.
50 రోజులకే కోటి రూపాయల వసూళ్లు రావడం నిజంగా గ్రేటే. ఇలాంటి కరోనా పాండమిక్ టైంలో కూడా అఖండ వసూళ్లు ఈ రేంజ్లో ఉండడం.. ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ ఆడడం మామూలు సంచలనం కాదనే చెప్పాలి. ఇక అఖండ హిట్ జోష్‌లో ఉన్న బోయపాటి శ్రీను అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.