హీరోయిన్ అంకిత గుర్తుండే ఉంటుంది. ముంబైలో జన్మించిన ఈ అందాల భామ మూడేళ్ల వయసులో రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా పాపులర్ అయింది. ఆ తర్వాత పలు యాడ్స్‌లో నటించిన అంకిత వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన `లాహిరి లాహిరి లాహిరిలో` సినిమాతో తొలిసారి హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమైంది.
విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో.. ఆమెకు తెలుగులో వెంట వెంటనే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. అంకిత రెండో చిత్రం `సింహాద్రి`. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో భూమిక మరో హీరోయిన్గా నటించింది. 9 జూలై 2003లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమా తర్వాత అంకిత స్టేట్ రౌడీ, విజయేంద్రవర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు చిత్రాలు చేసింది. అలాగే తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ, కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా అంకిత కెరీర్ క్రమంగా డౌన్ అయిపోయింది. అవకాశాలు లేకపోవడంతో చేసేదేమి లేక అంకిత పుణేకు చెందిన బిజినెస్ మాన్ విశాల్ జగ్తాప్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఈ దంపతులకు ఒక బాబు జన్మించాడు. ఇక ప్రస్తుతం అంకిత ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు తన తండ్రికి ఉన్న డైమండ్స్ వ్యాపారాన్ని చూసుకుంటోంది.