మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి కూడా ఒకటి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్. చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ వర్షాల టైంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఇక సూపర్‌స్టార్ కృష్ణ తన తనయుడు రమేష్‌బాబు హీరోగా భూలోక రంభ టైటిల్‌తో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఇంద్రజ హీరోయిన్. ఒకటి రెండు షెడ్యూల్స్‌తోనే ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి స్టైల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు భూలోకవీరుడు – జగదేకసుందరి అంటు చిరు సినిమాలా భారీ ఎత్తున తీయాలని అనుకున్నారు. అది కూడా ఎందుకో పట్టాలు ఎక్కలేదు.
ఆ తర్వాత సాహసయాత్ర అన్న పేరుతో మరో సినిమా స్టార్ట్ చేశారు. ఏకంగా 150 మందితో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశారు. జగదేకవీరుడు విలన్ అమ్రీష్‌పురినే ఈ సినిమాకు విలన్‌గా తీసుకున్నారు. ఇళయరాజా మ్యూజిక్. వంశీ దర్శకుడు. వంశీకి వీళ్లకు పొసగలేదు.. చివరకు ఘట్టమనేని సినిమాల ఆస్థాన డైరెక్టర్ అయిన కేఎస్ఆర్. దాస్ రంగంలోకి దిగారు.
ఈ సారి ఇళయరాజా బదులుగా కోటి వచ్చారు. హీరోయిన్లుగా గౌతమి, రమ్యకృష్ణ, మహాలక్ష్మి, రూపిణి వచ్చారు. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత రమేష్‌బాబుకు సినిమాల పట్ల ఆసక్తి పోయింది. ఆ తర్వాత వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి మహేష్‌బాబుతో అతిథి, అర్జున్ సినిమాలు తీశారు.