బాలయ్య 2014 ఎన్నికలకు ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఆయన తన పనేదో తాను చూసుకునే వాడు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి తన తండ్రి కంచుకోట అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉండడంతో తన వంతుగా నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఓడిపోయినా కూడా హిందూపురంలో బాలయ్య 2014 ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఇక బాలయ్య పార్టీ వ్యవహారాల్లో ముందు నుంచి పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదు. అయితే తన అనుకున్న వారికి మాత్రం పట్టుబట్టి మరీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. బాలయ్యను నమ్ముకుని కొందరు నేతలు టిక్కెట్లు తెచ్చుకున్నారు. అలా టిక్కెట్లు తెచ్చుకున్న వారిలో అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరెవరు బాలయ్య ప్రాపకంతో టిక్కెట్లు తెచ్చుకుని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచారో చూద్దాం.
చెంగల వెంకట్రావు:
విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు. బాలయ్యతో 1999లో సమరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత బాలయ్య సిఫార్సుతోనే ఆయన టీడీపీలో చేరి 1999లో ఫస్ట్ టైం పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో మరోసారి గెలిచారు. 2009లో ఓడిపోయిన బాబూరావు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లినా అక్కడ 2014లో ఓడిపోయారు. 2019లో మాత్రం ఆయనకు టిక్కెట్ రాలేదు.
వెలగపూడి రామకృష్ణ బాబు:
విశాఖ తూర్పు నుంచి టీడీపీ టిక్కెట్‌పై వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు వెలగపూడి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయనకు ఎదురు లేదు. 2009 ఎన్నికల్లో బాలయ్య సిఫార్సుతోనే ఆయన తొలిసారిగా సీటు దక్కించుకున్నారని అంటారు. ఆ తర్వాత వెలగపూడి అక్కడ పాతుకుపోయారు. వరుసగా భారీ విజయాలతో ఇప్పుడు విశాఖ టీడీపీలో కింగ్‌గా ఎదిగారు.
కదిరి బాబూరావు:
బాలయ్యకు చిన్ననాటి స్నేహితుడు అయిన కదిరి బాబూరావు నిజాం కాలేజ్‌లో బాలయ్యతో కలిసి చదువుకున్నారు. 2004లో దర్శి నుంచి పోటీ చేసిన ఆయనకు 2009లో బాలయ్య కనిగిరి సీటు ఇప్పించారు. అయితే నామినేషన్లో తప్పులు దొర్లడంతో పోటీ చేయలేకపోయారు. తర్వాత 2014లో కనిగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత ఎన్నికల్లో మళ్లీ దర్శిలో పోటీ చేసి ఓడిపోయారు.
వీరితో పాటు బాలయ్య సిఫార్సు చేసిన నేతల్లో రంగనాయకులు, అంబికా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లకు కార్పోరేషన్ పదవులు కూడా దక్కాయి.