కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. తెలుగులో ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా వీటన్నింటి కంటే ముందుగా కొన్ని సంవత్సరాల క్రితమే శంకరాభరణం సినిమా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంది. ఎన్నో జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో నటించిన రాజ్యలక్ష్మి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1979లో ఆమె పదవ తరగతి చదువుతున్నప్పుడే… కె.విశ్వనాథ్ శంకరాభరణం సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వెతుకుతున్నారు. అప్పుడు రాజ్యలక్ష్మి తన తల్లితో కలిసి చెన్నై వెళ్లి విశ్వనాథను కలిసి ఆ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
తొలి సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడంతో రాజ్యలక్ష్మి పేరు మార్మోగిపోయింది. తెలుగు – తమిళం – కన్నడం – మలయాళం – హిందీ భాషల్లో కూడా ఆమెకు ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. రాజ్యలక్ష్మి స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమెకు శంకరాభరణం సినిమా తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. హీరోయిన్‌గా 20 సినిమాలు చేసిన ఆమె శంకరాభరణం సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుని శంకరాభరణం రాజ్యలక్ష్మిగా గుర్తింపు దక్కించుకుంది.
1990 లో ప్రేమ వివాహం చేసుకున్న రాజ్యలక్ష్మి ఆ తర్వాత తన భర్తతో కలిసి సింగపూర్ వెళ్లిపోయింది. ఆమెకు రోహిత్ – రాహుల్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇక పిల్లలు పెద్దయ్యాక 2004లో ఆమె తిరిగి చెన్నైకు వచ్చింది. ప్రస్తుతం సీరియల్స్‌లో రాజ్యలక్ష్మి బిజీబిజీగా ఉన్నారు. అయితే ఆమె పెళ్లి విచిత్రంగా జరిగింది. ఒక రోజు ఆమె తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఒక యువకుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్నేహితులు అయ్యారు.
అతడు తాను సింగపూర్‌లో ఉంటానని చెప్పడంతో పాటు మీరు షూటింగ్‌కు వచ్చినప్పుడు నన్ను కలవమని చెప్పాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి సింగపూర్‌కు వెళ్లినప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లడం.. వాళ్లకు కూడా నచ్చడంతో ఆమె అతడిని పెళ్లి చేసుకుంది. రాజ్యలక్ష్మిని చూసిన అత్తా, మామ ఆమెను కోడలిగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. అలా ఆమె పెళ్లి జరిగింది.