శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళుతూ, కొత్వాల్ గూడ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, భరత్ భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలుపగా, సోదరుడి మృతితో రవితేజకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ ప్రమాదం గురించిన మరింత సమాచారాన్ని పోలీసులు తాజాగా వెల్లడించారు. ప్రమాదం సమయంలో భరత్ ఒంటరిగా కారును నడుపుకుంటూ వచ్చారని, ప్రమాదం విషయం అతని స్నేహితులకు తెలిసినప్పటికీ, వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. రోడ్డు పక్కన బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆగి వుండగా, హెచ్చరికగా లారీ వెనుక చెట్టు కొమ్మలను సైతం అమర్చారని, దాన్ని గుర్తించకపోవడమే ప్రమాదానికి కారణమని అన్నారు.
ప్రమాదం జరిగిన వాహనం ‘టీఎస్ 09 ఈసీ 0799’ రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రమాదం తరువాత కారులోని ఎయిర్ బ్యాగులు తెరచుకున్నాయని, అధిక వేగం కారణంగా, కారు ముందు భాగం మొత్తం లారీ వెనక చక్రాల కింద వరకూ దూసుకెళ్లడంతో భరత్ మృతదేహం గుర్తించలేని విధంగా ఛిద్రమైందని అన్నారు. ఉదయం ఆయన బంధువులు వచ్చి గుర్తించిన తరువాతనే మరణించిందని నటుడు రవితేజ సోదరుడని తమకు తెలిసినట్టు పేర్కొన్నారు. ప్రమాద విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారన్న విషయమై విచారణ జరుపుతామని, అతని స్నేహితులను ప్రశ్నిస్తామని పోలీసులు స్పష్టం చేసారు.