ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల ధరల విషయం చిలికిచిలికి గాలివానలా మారుతుంది. తాజాగా ఈ అంశంపై నేచురల్ స్టార్ నాని జగన్ ప్రభుత్వాన్ని గిచ్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా టీంతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని రాజకీయ నాయకులు… సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రేక్షకులను అవమానపరిచేలా ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది… ఏదిఏమైనా ఆ నిర్ణయం సరికాదు… టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను ప్రభుత్వం అవమానపరిచిందని నాని చెప్పారు.
థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపు కలెక్షన్ ఎక్కువగా ఉందని… ధరలు పెంచినా టిక్కెట్లు కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని చెప్పారు. అలాగే చివరిగా తను ఇప్పుడు ఏం ? మాట్లాడినా వివాదమే అవుతుందని కూడా చెప్పారు. అయితే నాని వ్యాఖ్యలను ఇండస్ట్రీలో కొందరు సమర్థిస్తూ ఉంటే… మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. నిర్మాత నట్టి కుమార్ నాని వ్యాఖ్యలను తప్పుపట్టారు.
కలెక్షన్ల గురించి అవగాహన లేకుండా ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని… ఆయన వెంటనే ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము టికెట్ ధరల విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని… ఈ వ్యాఖ్యల వల్ల మిగిలిన సినిమాలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని తాను అనుకుంటున్నానని నట్టికుమార్ చెప్పారు.
ఇక నాని వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఖండించారు. టికెట్ ధరలు నియంత్రిస్తే ప్రేక్షకులను ఎలా ? అవమానించి నట్టు అవుతుందని అని బొత్స ప్రశ్నించారు. మార్కెట్లో ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని… ఎవరికివారు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అమ్ముకోవడం ధర్మం కాదని బొత్స కౌంటర్ ఇచ్చారు.