టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. టాలీవుడ్ లో గత 6 దశాబ్దాలలో ఎంత మంది దర్శకులు వచ్చిన కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్టైలే వేరు. రాఘవేంద్రరావు స్థాయికి సరితూగే దర్శకులు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. శతాధిక చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన రాఘవేంద్రరావు కెరీర్లో నాటి తరంలో ఎన్టీఆర్ నుంచి నేటి తరంలో అల్లు అర్జున్ వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించారు. ఆరు దశాబ్దాలుగా దర్శకత్వ విభాగంలో కొనసాగుతూ వందకు పైగా సినిమాలు తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు.
పైగా రాఘవేంద్రరావు తీసిన సినిమాలలో 70 నుంచి 80 శాతం సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి.
ఈ రోజు తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకు వెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి సైతం రాఘవేంద్రరావు శిష్యుడే. కోదండరామిరెడ్డి, బి.గోపాల్ లాంటి స్టార్ దర్శకులు కూడా రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన వారే. ఇక రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు చివర బిఏ అని ఉంటుంది.
ఈ బిఏ అనే పదానికి సెంటిమెంట్ ఉందని రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాఘవేంద్రరావు బిఏ చదువుకున్నారు. తాను దర్శకుడిని కాకపోయి ఉంటే బిఏకు ఏం ఉద్యోగం వచ్చేదని.. అప్పుడు తాను డ్రైవర్‌ను అవుతానేమో అని అనుకునేవాడిని అని చెప్పారు. కెరీర్ ఆరంభంలో రాఘవేంద్రరావు పేరు చివర బిఏ అని టైటిల్స్ లో వేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అట.
ఆ తర్వాత ఒక సినిమాకి కాకతాళీయంగా బిఏ అన్న పదం పెట్టలేదు అట. దీంతో ఆ సినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు పట్టుబట్టి తన తర్వాత సినిమాకు బిఏ అని టైటిల్ వేయించారట. మళ్లీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి తన పేరు చివర బిఏ అన్నది కామన్ అయిపోయిందని రాఘవేంద్రరావు చెప్పారు.