టైటిల్: అఖండ
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్య జైశ్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, ప్రభాకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సీ రామ్ ప్రసాద్
మ్యూజిక్ : థమన్. ఎస్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
ఫైట్స్: స్టన్ శివ, రామ్, లక్ష్మణ్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
సెన్సార్ రిపోర్ట్: U / A
రన్ టైం: 167 నిమిషాలు
వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్: రు. 54 కోట్లు
రిలీజ్ డేట్: 02 డిసెంబర్, 2021
యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా అఖండ. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు బాలయ్య కెరీర్‌ను శిఖరాగ్రంలో నిలబెట్టాయి. ఈ తరంలో బి.గోపాల్ తర్వాత బోయపాటి శ్రీను మాత్రమే బాలయ్య ను ఆయన ఫ్యాన్స్ ఎలా ఊహించుకుంటున్నారో అంత స్ట్రాంగ్‌గా చూపించారు.లెజెండ్ తర్వాత ఏడున్నర సంవత్సరాల గ్యాప్‌తో మరోసారి వీరి కాంబోలో అఖండ సినిమా తెరకెక్కింది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్. రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లతో దుమ్మ రేపిన అఖండ కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో వస్తోన్న పెద్ద సినిమా. మరి అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండ జ్యోతిని వెలిగించిందా ? బాలయ్య – బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టిందా లేదా ? అన్నది TL సమీక్షలో చూద్దాం.
కథ:
ఊరికి పెద్దగా ఉండే బాలయ్య అందరికి అండగా ఉంటూ .. అన్యాయం సహించడు. అతడి మంచి తనాన్ని చూసి ప్రేమలో పడ్డ ప్రగ్య జైశ్వాల్ అతడిని పెళ్లి చేసుకుంటుంది. శ్రీకాంత్ (వరదరాజులు) అక్రమ మైనింగ్ నడిపిస్తూ ఉంటాడు. శ్రీకాంత్ అరాచకాలు అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన బాలయ్య ఓ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వరదరాజులు అరాచకాలు మరింత పేట్రేగిపోతాయి. ఆ టైంలో ఎంట్రీ ఇస్తాడు అఖండ (బాలయ్య). అసలు అఖండ ఎవరు ? అఖండకు ఊళ్లు ఉన్న బాలయ్యకు లింక్ ఏంటి ? వరదరాజులు వెనకాల ఎవరు ఉన్నారు ? బాలయ్య అఘోరాగా ఎందుకు మారాడు ? ఈ ప్రశ్నలకు సమాధానమే అఖండ.
TL విశ్లేషణ:
అఖండ సినిమా స్టార్టింగ్ నుంచే కళ్లు చెదిరిపోయే యాక్షన్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్టాఫ్ అంతా సినిమాలో పాత్రల పరిచయంతో పాటు కథలోకి మూవ్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో అఘోరా ఎంట్రీతో లేచే సినిమా ఫ్యీజులు ఎగిరిపోయేలా చేస్తుంది. సెకండాఫ్ అంతా యాక్షన్ మయం చేసేశారు. యాక్షన్ సీన్లలో బాలయ్యను చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. ఇక ప్రగ్య జైశ్వాల్, శ్రీకాంత్, జగపతిబాబు పాత్రలు బాగున్నాయి. అయితే హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు బోరింగ్‌గా ఉన్నాయి.
స్టోరీ మాత్రం రొటిన్‌గానే ఉంది తప్పా యాక్షన్ సీన్లు, టేకింగ్ అంతా కంటిన్యూగా గూస్ బంప్స్ వచ్చేలా బోయపాటి తెరకెక్కించాడు. లెజెండ్ సినిమాలో జగపతిబాబు రోల్ అతడి కెరీర్‌కు ఎలా టర్న్ అయ్యిందో ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర కూడా అతడికి అంతే టర్న్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. టెక్నికల్ విషయానికి వస్తే సీ రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ లుక్ తీసుకువచ్చింది.
ప్రతిఫ్రేమ్ చాలా బాగుంది. సీన్లు, మూడ్‌కు తగినట్టుగా రామ్‌ప్రసాద్ విజువల్స్‌ను తీసిన తీరు అద్భుతం. ఎం. రత్నం డైలాగులకు నందమూరి అభిమానులు థియేటర్లలో ఊగిపోతున్నారు. రాయలసీమ యాసలో చెప్పిన డైలాగులు సూపర్. ఇక థమన్ మ్యూజిక్ సినిమాను సగం హిట్ చేసిందనే చెప్పాలి. పాటల్లో జై బాలయ్య సాంగ్ ఊపు ఊపేసింది. ఇక ఆర్ ఆర్ అయితే చంపేసింది. అఘోర పాత్ర వస్తుంటే థియేటర్లలో బాక్సులు బద్దలైపోయాయి.. ప్రేక్షకులు కూడా పూనకంతో ఊగిపోయారు. థమన్ వర్క్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎడిటింగ్ సెకండాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సిందనిపించింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణ విలువలు ఎక్కడా రాజీపడకుండా ఉన్నాయి.
బోయపాటి డైరెక్షన్ కట్స్ :
దర్శకుడు బోయపాటి మాస్‌ను, బాలయ్య అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య ఫ్యాన్స్ ఎక్కడా నిరాశ పడకుండా వారిలో ఈ సినిమా జోష్ నింపుతోంది. ఫస్టాఫ్‌లో మంచి కథతో పాటు యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశాడు. ఇంటర్వెల్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా స్కైను టచ్ చేస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం బోయపాటి కథ విషయంలో ట్రాక్ తప్పాడు. పెద్దగా కథ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశాడు. బాలయ్య అఖండ రోల్ మాత్రం సినిమాకే ఆయువు పట్టు. బాలయ్య నటన భీకరంగా ఉంది. ఏదేమైనా సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్యకు అఖండ రూపంలో మరో గర్జన లాంటి హిట్ ఇచ్చాడు.
ప్లస్ పాయింట్స్ ( + ):
– బాలయ్య ఎనర్జిటిక్ పెర్పామెన్స్
– పవర్ ఫుల్ డైలాగులు
– మాస్‌ను మెప్పించే కళ్లు చెదిరే యాక్షన్
– థమన్ బీజీఎం
– బోయపాటి మాస్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్ ( – ):
– కొన్ని బోరింగ్ సీన్లు
– హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ సీన్లు
– కథ మరీ కొత్తగా లేకపోవడం
ఫైనల్‌గా…
బాలయ్య అఖండ గర్జనతో తెలుగు సినిమాకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత కొత్త వెలుగు ఇచ్చాడు. అఖండ గర్జనతో నటసింహం విశ్వరూపం చూపించాడు. గణగణ మాస్ జాతరే..!
TL అఖండ రేటింగ్: 3.5 / 5