యువరత్న నందమూరి బాలకృష్ణ – లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. మెగాస్టార్ చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత విజయశాంతి – బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్ కు అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు.
చాలామంది టాప్ దర్శకులు కూడా బాలయ్యతో సినిమా చేసేటప్పుడు విజయశాంతిని హీరోయిన్ గా పట్టుబట్టి మరి పెట్టేవారు. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత బాలకృష్ణ – విజయశాంతి కాంబినేషన్ లో మళ్లీ సినిమా రాలేదు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాకు విజయశాంతి పెట్టుబడి పెట్టారు. సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకోవడంతో బడ్జెట్ ఎక్కువై లాభాలు రాలేదు.
అయితే నిప్పురవ్వ రిలీజ్ అయిన రోజునే బాలయ్య నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకు పోయింది. రవీనా టాండన్ – రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు.
ఒకే రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ అంచనాలు అందుకోలేక పోతే… బంగారు బుల్లోడు మాత్రం సూపర్ హిట్ అయ్యింది.
ఇక నిప్పురవ్వ తర్వాత విజయశాంతి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించారు. రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగిపోయింది. అదే సమయంలో రమ్యకృష్ణ – రోజా – రంభ లాంటి హీరోయిన్లు రాజ్యమేలుతున్నారు. ఈ క్రమంలోనే విజయశాంతి – బాలయ్యకు సెట్ అయ్యే కథలు కూడా దర్శకులు ఎవ్వరూ రూపొందించలేదు. అక్కడితో బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ కు బ్రేక్ పడిపోయింది.