టాలీవుడ్ లో నటరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన యువరత్న నందమూరి బాలకృష్ణకు కెరీర్లో ప్లాప్ సినిమాలతో పోల్చుకుంటే హిట్ సినిమాలు కాస్త తక్కువే. అయితే బాలకృష్ణకు హిట్ సినిమా పడితే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. మంగమ్మగారి మనవడు 500 రోజులు ఆడిన భారత దేశ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు సంవత్సరం పాటు ఆడాయి. ఒకటి రెండేళ్లలో ప్లాప్ సినిమాలు పడినా ఒక్క హిట్ వస్తే ఇండస్ట్రీ షేక్ అయిపోయేది.
ఈ క్రమంలోనే 1999లో వచ్చిన సమరసింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య మార్కెట్ నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. ఆ సినిమా 77 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఆ సినిమా హీరో బాలయ్య – హీరోయిన్ సిమ్రాన్ – దర్శకుడు బి.గోపాల్ – మ్యూజిక్ దర్శకుడు మణిశర్మ కాంబినేషన్ మరోసారి నరసింహానాయుడుతో రిపీట్ అయ్యింది. 2001లో సంక్రాంతికి నరసింహనాయుడు సినిమా రిలీజ్ అయింది.
నరసింహనాయుడుకు పోటీగా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు – విక్టరీ వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు అయితే నరసింహ నాయుడు తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతదేశ సినిమా చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి 127 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న నరసింహనాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
భారతదేశ చరిత్రలో ఒక హీరో నటించిన సినిమా వంద కేంద్రాల్లో 100 రోజులు ఆడటం అదే తొలిసారి. ఈ అరుదైన రికార్డు బాలకృష్ణకే దక్కింది. చిన్నికృష్ణ కథకి తోడు బాలయ్య నట విశ్వరూపం, బి.గోపాల్ టేకింగ్ సెంటిమెంట్ అన్నీ కలిపి నరసింహ నాయుడును సూపర్ డూపర్ హిట్ చేశాయి.