తెలుగు సినిమా రంగంలో గత నాలుగు దశాబ్దాల్లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. స్టార్ హీరోయిన్ గా ఎదిగారు వెళ్ళిపోయారు. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సీనియర్ నటి రమ్యకృష్ణలా మాత్రం ఈ తరం హీరోయిన్లలో ఎవరు లేరు. 1980 ల్లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ తన అందచందాలతోనే కాదు … అభినయంతో కూడా కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా సౌతిండియా సినీ పరిశ్రమను కూడా ఒక మకుటంలేని మహారాణిగా ఏలేసింది.
కేవలం సాంఘిక చిత్రాలలోనే కాకుండా భక్తిరస చిత్రాల్లోనూ చారిత్రాత్మక చిత్రాల్లోనూ.. ఏ పాత్రలో అయినా రమ్యకృష్ణ ఇట్టే ఇమిడి పోతుంది. బాహుబలి సినిమాలో శివగామి దేవిగా ఆమె నట విశ్వరూపం యావత్ ప్రపంచం మెచ్చుకుంది. ఎంత వయసు వచ్చినా కూడా రమ్యకృష్ణ ఇప్పటికీ ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేస్తుంది. అహంతో కూడిన క్యారెక్టర్లు వేయాలన్నా, లేడీ విలన్ క్యారెక్టర్లు వేయాలన్నా రమ్యకు సాటి వచ్చే వారెవ్వరు లేరు.
రమ్యకృష్ణ సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమ పెళ్లి చేసుకుని ప్రస్తుతం సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. రమ్యకృష్ణ – కృష్ణవంశీ మధ్య చంద్రలేఖ సినిమాలో తొలిసారిగా చూపులు కలిశాయట. నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు.
ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మనసులు కలవడంతో అది కొన్నేళ్లపాటు ప్రేమగా కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తర్వాత పెళ్లి అయ్యేంత వరకు చాలా రోజుల పాటు వీరి ప్రేమ సీక్రెట్‌గానే ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక బాహుబలి తర్వాత రమ్యకృష్ణ కెరీర్ మరింత స్పీడ్ గా ముందుకు వెళుతోంది.