రోబో సినిమా తరువాత రజినీకాంత్ నటించిన సినిమాలు అన్ని ఆయన స్థాయికి తగిన హిట్ ఇవ్వలేక పోతున్నాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన కబాలి – కాలా -పేట… తాజాగా పెద్దన్న ఈ సినిమాలు అన్ని భారీ అంచనాలతో వచ్చి బొక్క బోర్లా పడుతున్నాయి. ప్రతిసారి రజనీ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు, రజనీ అభిమానులు సినిమా అదిరిపోతుందని… రికార్డులన్నీ బద్దలు అవుతాయని ఎన్నో ఆశలతో ఉంటున్నారు.
సినిమా రిలీజ్ అయ్యాక వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తాజాగా మాస్ డైరెక్టర్ సిరుత్తై శివ దర్శకత్వంలో వచ్చిన అన్నాత్తే ( తెలుగులో పెద్దన్న) సినిమా కూడా డిజాస్టర్ అయింది. రజిని ఇమేజ్‌కు ఏమాత్రం సూట్ కానీ పాత కథను సినిమాగా తీసేశారన్న విమర్శలు వచ్చాయి. పాత రొడ్డకొట్టుడు కథను దుమ్ముదులిపి అన్నాత్తే సినిమాగా తీశారు అని విమర్శలు వచ్చాయి.
అన్నాత్తే సినిమా రజనీ అభిమానులు కూడా మెప్పించలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దన్నగా విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా తీవ్ర నిరాశతో పాటు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాను తెలుగులో సురేష్ బాబు రిలీజ్ చేయడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తం పదిహేను కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం రు. 4.8 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
తెలుగులో ఇప్పటికే రజినీకాంత్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇక అన్నాత్తే సినిమా ఘోరంగా ఫ్లాప్ అవడంతో రజనీ సినిమాలకు గుడ్ బై చెప్పితేనే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.