టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత స్టార్ హీరో అయినా కూడా కేవలం ఆరు నెలల్లోనే పూరి సినిమాను ఫినిష్ చేసేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను సైతం పూరి కేవలం రెండు నెలల్లోనే కంప్లీట్ చేసిన రికార్డులు కూడా ఆయన సొంతం. పూరి తొలిసారి పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి ( 2000) సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే పూరి పెద్ద బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే పూరి ఫస్ట్ సినిమా బద్రి కాకుండా సూపర్ స్టార్ కృష్ణతో చేయాల్సి ఉంది. 1996లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. పూరి టేకింగ్ నచ్చడంతో కృష్ణ ఆయనకు దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఫైనాన్ష ప్రాబ్లమ్స్ వల్ల రెండు సార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఇక పట్టాలు ఎక్కలేదు.
అయితే ఈ సినిమా తర్వాత మరో మూడేళ్ల పాటు వెయిట్ చేసిన పూరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు బద్రి కథ వినిపించి.. ఆ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. అప్పటి నుంచి పూరి వెనుదిరిగి చూసుకోలేదు. అయితే కృష్ణ సినిమా మిస్ అయిన పూరి ఆయన తనయుడు మహేష్‌బాబుతో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. 2006లో తొలిసారి వచ్చిన పోకిరి సినిమా హిట్ అయ్యింది.
ఆ తర్వాత 2012లో మరోసారి బిజినెస్‌మేన్ సినిమా వచ్చింది. అది కూడా హిట్ అయ్యింది. అయితే మూడో సినిమాగా జనగణమన రావాల్సి ఉన్నా అది కొన్ని కారణాల వల్ల పట్టాలు ఎక్కలేదు. ఇక పూరి తాజాగా విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.