ఏపీలో టిక్కెట్ల రేట్ల తగ్గింపు దెబ్బతో టాలీవుడ్ విలవిల్లాడుతోంది. ఇక పలుసార్లు మంత్రి పేర్ని నానితో ఇండస్ట్రీ పెద్దలు భేటీలు అవుతున్నా టిక్కెట్ల రేట్ల పెంపు వ్యవహారం మాత్రం ఓ కోలిక్కి రావడం లేదు. ఇక ఈ తగ్గింపు వ్యవహారంతో మొత్తంగా రు. 100 కోట్లకు ఇండస్ట్రీకి బ్యాండ్ పడిపోతోంది. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గించడంతో ప్రతి పెద్ద సినిమా మార్కెట్ 20 నుంచి 30 శాతం వరకు రివైజ్ చేస్తున్నారు.
బాలయ్య అఖండను ఆంధ్రాలో రు. 35 కోట్లకు, సీడెడ్‌లో రు. 12 కోట్లకు మార్కెట్ చేశారు. ఇప్పుడు 30 % తగ్గించాలని బయ్యర్లు కోరడంతో రు. 9 కోట్లు నష్టపోవాల్సి వస్తోంది. పుష్పను ఆంధ్రాలో రు. 60 కోట్లు, సీడెడ్‌లో 40 కోట్లకు బిజినెస్ చేశారు. ఇప్పుడు 20శాతం కోత పెడుతున్నారు.. అంటే ఏపీలోనే ఏకంగా రు. 28 కోట్ల మేరకు కట్ చేయాలి.
ఇక ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలకు కూడా డిస్కౌంట్లు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుంటే ఓవరాల్‌గా రు. 70 కోట్లకు పైగానే ఇండస్ట్రీ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మార్కెట్ జరిగిపోయాక తగ్గిస్తోన్న వ్యవహారం. దీంతో పాటు మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు అవన్నీ కూడా లెక్కలు వేసుకుంటే ఓవరాల్‌గా రు.100 కోట్ల నష్టం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏదేమైనా జగన్ ఏమైనా ఇండస్ట్రీని కనికరించి.. వారు రేట్లు పెంచుకుని అమ్ముకుంటే రు.100 కోట్లు వాళ్లకు అదనపు ఆదాయం ఉంటుంది. లేకపోతే భారీగా బొక్క తప్పదు.